వంటగ్యాస్ వినియోగదారులపై పశ్చిమాసియా యుద్ధ మేఘాలు ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్ పరిసరాల్లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తమైంది.
భారత్‌కు అందాల్సిన ఎల్పీజీ దిగుమతుల్లో అంతరాయం ఏర్పడటంతో, దేశీయంగా గ్యాస్ నిల్వలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థలు సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సరఫరా చేస్తున్న 14.2 కేజీల సిలిండర్ల స్థానంలో కేవలం 10 కేజీల గ్యాస్‌ను మాత్రమే నింపి పంపిణీ చేయాలని భావిస్తున్నాయి.సాధారణంగా ఒక మధ్యతరగతి కుటుంబానికి 14.2 కేజీల సిలిండర్ సుమారు 35 నుంచి 40 రోజుల వరకు వస్తుంది. అదే 10 కేజీల సిలిండర్ అయితే దాదాపు నెల రోజుల పాటు సరిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇలా చేయడం వల్ల అందుబాటులో ఉన్న పరిమిత నిల్వలను ఎక్కువ మంది వినియోగదారులకు పంపిణీ చేయవచ్చని, తద్వారా కృత్రిమ కొరతను నివారించవచ్చని చమురు సంస్థలు భావిస్తున్నాయి. సిలిండర్ బరువు తగ్గితే దానికి అనుగుణంగా ధరను కూడా తగ్గించి వినియోగదారులపై భారం పడకుండా చూడనున్నారు.
భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో దాదాపు 60% దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇందులో 90% వరకు హోర్ముజ్ జలసంధి గుండానే రావాల్సి ఉండటంతో ప్రస్తుతం సరఫరా నెమ్మదించింది.ఈ నిర్ణయం అమలులోకి రావాలంటే బాట్లింగ్ ప్లాంట్లలోని వెయింగ్ మెషీన్లను రీ-కాలిబ్రేట్ చేయాల్సి ఉంటుంది.
అలాగే ప్రభుత్వ అనుమతులు కూడా తప్పనిసరి. ప్రస్తుతానికి ఇది ప్రాథమిక చర్చల దశలోనే ఉన్నప్పటికీ, సరఫరా పరిస్థితి మెరుగుపడకపోతే త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరోవైపు గ్యాస్ వినియోగంలో పొదుపు పాటించాలని, అనవసరంగా నిల్వ చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు.
