సమాజంలో క్షయ (టీబీ) వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, అప్రమత్తతతోనే ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చని నగర మేయర్ దండు ఉమారాణి రమేష్ పిలుపునిచ్చారు.
ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా మంగళవారం నగరంలోని శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రాంగణంలో ఐఎంఏ , శ్రీ విష్ణు ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘మేము క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలిస్తాము’ అనే నినాదంతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి మేయర్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు.
అనంతరం ఆసుపత్రి రూపొందించిన ప్రత్యేక అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ముఖ్యంగా నిరక్షరాస్యులు, పారిశుధ్య కార్మికులు, దినసరి కూలీలు వ్యాధి లక్షణాలను గుర్తించక, ముదిరిన తర్వాత వైద్యులను సంప్రదించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త పడాలని సూచించారు.
ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ ఆకుల విశాల్ మాట్లాడుతూ.. ప్రజారోగ్యం పట్ల ఐఎంఏ ఎల్లప్పుడూ బాధ్యతతో పనిచేస్తుందని తెలిపారు. మేయర్ సూచన మేరకు రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్మికులు, సిబ్బంది కోసం ప్రత్యేక హెల్త్ క్యాంప్‌లు నిర్వహిస్తామని ప్రకటించారు.
వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందాలని కోరారు. శ్రీ విష్ణు ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్, ఐఎంఏ కోశాధికారి డాక్టర్ రమణేశ్వర్ మాట్లాడుతూ.. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
టీబీ కేవలం ఊపిరితిత్తులకే కాకుండా వెన్నుముక, పొట్ట, ఎముకలకు కూడా వచ్చే అవకాశం ఉందని వివరించారు. ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ మోహన్ మాట్లాడుతూ.. వ్యాధి తీవ్రతను బట్టి 6 నెలల నుండి రెండేళ్ల వరకు క్రమం తప్పకుండా మందులు వాడితే టీబీని పూర్తిగా నయం చేయవచ్చని, ఇందుకు ప్రోటీన్లతో కూడిన బలవర్ధకమైన ఆహారం తోడ్పడుతుందని తెలిపారు.అనంతరం ముఖ్యఅతిథి మేయర్ ఉమారాణి రమేష్‌ను వైద్య బృందం శాలువా, జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ హరీష్ స్వామి, వైద్యులు జీవన్ రావు, శిల్ప వేణుగోపాల్, శ్రీశైలం, వినోద్ కుమార్, నవీన్ మాలు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
