HomeCRIMEఎక్సైజ్ శాఖలో వసూళ్ల దందా.!

ఎక్సైజ్ శాఖలో వసూళ్ల దందా.!

జిల్లా ఎక్సైజ్ శాఖలో అక్రమ వసూళ్ల పర్వం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. నిబంధనల అమలును పర్యవేక్షించాల్సిన కొందరు కిందిస్థాయి సిబ్బంది.. అక్రమ సంపాదనలో ఆరితేరిపోతున్నారు. చిత్రమేమిటంటే, ఈ వసూళ్లన్నీ తాము తినడం లేదని, ‘పైస్థాయి అధికారులకు’ వాటాలు ఇవ్వాలంటూ బహిరంగంగానే బేరసారాలు సాగిస్తుండటం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు, కల్లు డిపోల నిర్వాహకుల నుంచి నెలవారీ ముడుపుల కోసం సిబ్బంది వేట సాగిస్తున్నారు. “పైనున్న సాబ్ అడుగుతున్నారు.. మేము చేసేదేముంది?” అంటూ చిరుద్యోగులు షాపుల యజమానులపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

జిల్లాలో గతంలో చురుగ్గా ఉండి, ప్రస్తుతం గడువు ముగిసిన కొన్ని ఉద్యోగ సంఘాల (యూనియన్ల) పేర్లను కొందరు సిబ్బంది ఇప్పటికీ వాడుకుంటున్నారు. ఆయా సంఘాల ముసుగులో వ్యాపారుల నుంచి భారీగా నగదు దండుకుంటున్నట్లు సమాచారం.

యూనియన్ ఉనికిలో లేకపోయినా, పాత పరిచయాలను వాడుకుంటూ వసూళ్లకు పాల్పడుతుండటంపై తోటి ఉద్యోగుల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది. అడిగినంత ముట్టజెప్పని పక్షంలో తమకున్న ‘పలుకుబడి’తో వేధింపులకు గురిచేస్తున్నారని బాధితులు వాపోతున్నారు.

శాఖలో విధులు నిర్వహిస్తూనే కొందరు అధికారులు సమాంతరంగా ప్రైవేటు వ్యాపార సామ్రాజ్యాలను నడుపుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వోద్యోగి ఎలాంటి ఇతర లాభదాయక వ్యాపారాల్లో నిమగ్నం కాకూడదు. కానీ, ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోందనీ విమర్శలు వెలువెతుతున్నాయి.

కార్యాలయ సమయాల్లో కూడా తమ వ్యక్తిగత వ్యాపార లావాదేవీల పర్యవేక్షణలోనే వీరు కాలం గడుపుతున్నట్లు తెలుస్తోంది. మరికొందరు అధికారులు బినామీల పేర్లతో రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

మరోవైపు, విధుల్లో ఉండాల్సిన సమయంలోనే కొందరు అధికారులు తమ ప్రైవేట్ బిజినెస్ ఫోన్ కాల్స్‌తో బిజీగా ఉండటం, కార్యాలయానికి వచ్చే ప్రజలను పట్టించుకోకపోవడం పరిపాటిగా మారింది.

నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నతాధికారులు?

జిల్లా అబ్కారీ శాఖలో కిందిస్థాయి సిబ్బంది ఇంతటి బహిరంగ దోపిడీకి తెగబడుతున్నా, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు ‘నిమ్మకు నీరెత్తినట్లు’ వ్యవహరించడం వెనుక మర్మమేమిటో అర్థం కావడం లేదు. కార్యాలయాల ముందే వసూళ్ల పర్వం సాగుతున్నా, బాధితులు లబోదిబోమంటున్నా పర్యవేక్షించాల్సిన ‘పెద్దలు’ మౌన ముద్ర దాల్చడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అసలు ఈ అక్రమ వసూళ్లలో పైస్థాయి వారికి కూడా ‘నజరానాలు’ అందుతున్నాయా? లేక కిందిస్థాయి వారి ఆగడాలను అరికట్టలేనంత నిస్సహాయ స్థితిలో యంత్రాంగం ఉందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.కొందరు సిబ్బంది అయితే ఏకంగా “మా పై అధికారులకే వాటాలు ఇస్తున్నాం.. మాపై ఫిర్యాదులు చేసినా ఫలితం ఉండదు” అంటూ బాహాటంగానే వ్యాపారులను భయపెడుతుండటం గమనార్హం.

గతంలో అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు నామమాత్రపు విచారణలతో సరిపెట్టడం వల్లే, ఇప్పుడు కిందిస్థాయి సిబ్బంది బరితెగించి ‘వసూల్ రాజా’లుగా మారుతున్నారని విమర్శలు వస్తున్నాయి.

కేవలం గంజాయి, కల్లు బట్టీలే కాకుండా, చివరకు మద్యం డిపోల వద్ద కూడా ప్రతి పనికీ ఒక ‘రేటు’ ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని, అవినీతికి పాల్పడుతున్న వారిపై వేటు వేయాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వారి చిత్తశుద్ధిపై కూడా మచ్చ పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments