నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో భారత మాజీ ఉప ప్రధాని, అణగారిన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు (అడ్మిన్, సి.ఏ.ఆర్) జి.బస్వా రెడ్డి, కె.రామ్ చందర్ రావ్ ముఖ్య అతిథులుగా హాజరై జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కుల వివక్షను ఎదిరించి, విద్య ద్వారా సామాజిక మార్పు సాధ్యమని నిరూపించిన గొప్ప నాయకుడు జగ్జీవన్‌రామ్ అని కొనియాడారు. 1935లో ‘అఖిల భారత అణగారిన వర్గాల లీగ్’ స్థాపించి అంటరానితనంపై పోరాడారని గుర్తు చేశారు.
ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో రక్షణ మంత్రిగా 1971 యుద్ధంలో కీలక పాత్ర పోషించారని, వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఆయన అంకితభావం, నిబద్ధత నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు.కార్యక్రమంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు సతీష్, వినోద్, స్పెషల్ బ్రాంచ్ ఎస్సైలు సంతోష్ రెడ్డి, సాయన్న, సిసిఆర్బి ఎస్సైలు శివరాం, విజయ్ కుమార్, సూపరింటెండెంట్ శంకర్ మరియు పలు విభాగాల పోలీస్ సిబ్బంది, హోంగార్డులు పాల్గొన్నారు.
