Monday, April 20, 2026
HomeTelanganaNizamabadమహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్‌ వ్యతిరేకం కాదు: డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి

మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్‌ వ్యతిరేకం కాదు: డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి

బిజెపి కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు..దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేందుకే నియోజకవర్గాల పునర్విభజనమహిళా రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ స్పష్టమైన చిత్తశుద్ధి ఉందని, అయితే రిజర్వేషన్ల పేరుతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామని జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు నగేష్ రెడ్డి స్పష్టం చేశారు.

సోమవారం జిల్లా కాంగ్రెస్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళా బిల్లు ముసుగులో బిజెపి ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి, ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందని నగేష్ రెడ్డి ఆరోపించారు.

2023లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడే కాంగ్రెస్ తన మద్దతు తెలిపిందని గుర్తు చేసిన ఆయన, “బిజెపికి నిజంగా మహిళలపై గౌరవం ఉంటే.. ప్రస్తుతం ఉన్న 543 పార్లమెంటు స్థానాల్లోనే మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలి” అని డిమాండ్ చేశారు.

పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా ఇప్పటికే వివరించారని తెలిపారు. స్థానిక సంస్థల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ స్థానాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆయన కొనియాడారు.

గతంలో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ నాయకత్వంలో మహిళా బిల్లును ముందుకు తీసుకెళ్లాలని చూస్తే అప్పట్లో బిజెపి అడ్డుకుందని విమర్శించారు. ఇప్పుడు రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ, కాంగ్రెస్ పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తే ప్రజలు సహించబోరని హెచ్చరించారు.

రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్ మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ల పేరుతో దేశాన్ని బలహీనపరిచేలా బిజెపి కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.

ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతారెడ్డి రాజారెడ్డి, కోశాధికారి భక్తవత్సలం, ఉపాధ్యక్షులు కౌడపు శరత్, ఓబీసీ విభాగం అధ్యక్షుడు నరేంద్ర గౌడ్, సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు యాదగిరి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రఘు, ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి, మహిళా కాంగ్రెస్ నాయకురాలు అపర్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!