కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనకు, ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఖైరతాబాద్‌లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఆసుపత్రిలో చేర్పించారు.
ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. 78 ఏళ్ల వయసున్న వి.హనుమంతరావుకు గతంలో కూడా ఇదే విధమైన కిడ్నీ సమస్యలు తలెత్తాయి.
అప్పట్లో చికిత్స పొంది కోలుకున్న ఆయన, ఇప్పుడు తిరిగి అదే అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. ప్రస్తుతం ఆయనకు నిపుణులైన వైద్య బృందం చికిత్స అందిస్తోందని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
పార్టీలో దశాబ్దాల కాలంగా అంకితభావంతో పనిచేస్తూ, కాంగ్రెస్ యువ నాయకుల్లో ఎప్పుడూ ఉత్సాహాన్ని నింపుతూ చురుగ్గా ఉండేవారు హనుమంతరావు.
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా వెన్నంటి ఉంటూ నిలబడిన నాయకుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఆయన ఆసుపత్రిలో చేరారనే వార్త తెలియగానే, పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
