Tuesday, April 28, 2026
HomeLaw and Orderధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహణలో నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం... ఐకేపీ ఏపీఎంకు షోకాజ్ నోటీసు...

ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహణలో నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం… ఐకేపీ ఏపీఎంకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశం…

ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహణలో నిర్లక్ష్యంపై కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల అలసత్వం వహించడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ, భీంగల్ మండల ఐకేపీ ఏపీఎంకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు.

భీంగల్ మండలం పల్లికొండ, భీంగల్ గ్రామాలలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పల్లికొండ కొనుగోలు కేంద్రం నిర్వహణలో లోటుపాట్లు నెలకొని ఉండడాన్ని కలెక్టర్ గమనించారు.

రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన వివరాలను సక్రమంగా నమోదు చేయకపోవడం, రిజిస్టర్ అందుబాటులో లేకపోవడం వంటి లోపాలను గుర్తించిన కలెక్టర్ కేంద్రం నిర్వాహకులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వహణ తీరు ఇలాగే ఉంటే కమీషన్ నిలిపివేస్తామని, వచ్చే సీజన్ నుండి సెంటర్ ను కేటాయించబోమని హెచ్చరించారు.

కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం లేదని ఏపీఎం కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు.

రైతుల ప్రయోజనాలతో ముడిపడిన అంశాలలో విధుల పట్ల నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో ధాన్యం సేకరణ జరిగేలా ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తెచ్చిన రైతులను పలుకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మాయిశ్చర్ యంత్రం ద్వారా తేమ శాతాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ధాన్యం బస్తాలను తూకం వేస్తున్న వేయింగ్ మిషన్ పనితీరును నిశిత పరిశీలన జరిపారు.

తరుగు, కోత వంటివి లేకుండా, రైతులు ఏ దశలోనూ నష్టపోకుండా పక్కాగా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. 17శాతానికి లోబడి తేమ శాతం ఉన్న ధాన్యాన్ని వెంటనే తూకం జరిపించి, మిల్లులకు తరలించాలని సూచించారు.

వెదర్ యాప్ ఆధారంగా వాతావరణ పరిస్థితుల గురించి ముందస్తుగానే రైతులకు వివరాలు తెలియజేస్తూ వారిని అప్రమత్తం చేయాలన్నారు. ట్రక్ షీట్లను వెంటదివెంట తెప్పించుకుంటూ, ట్యాబ్ ఎంట్రీలను వేగంగా జరిపించాలని, తద్వారా సకాలంలో రైతుల ఖాతాలలో బిల్లులు జమ అవుతాయని అన్నారు.

తహసిల్దార్లు, వ్యవసాయ అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్తాయిలో కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ, నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీఎం ప్రవీణ్, డీసీఓ శ్రీనివాస్, స్థానిక అధికారులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!