మంజీర పరివాహక ప్రాంతం ఇప్పడు ఇసుక మాఫియా కబంధ హస్తాల్లో చిక్కింది రాత్రి పగలు తేడా లేకుండా నదిలో ఇసుకను తోడేస్తున్నారు.నదిని నిట్ట నిలువునా తవ్వేస్తున్నారు. ఏడాది కి సరిపడా ఇసుక ను తీస్తున్నారు. వర్ష కాలం లో భారీగా సొమ్ము చేసుకోవడానికి ఇసుకను గుట్టలుగా నిల్వ చేస్తున్నారు ఒక్క సాలూర మినహా మంజీర నది లో ఇసుక క్వారీలు జెసిబి టిప్పర్ల తో జాతర ను తలిపిస్తున్నాయ్.
ఇసుక తవ్వకాల అంటేనే యంత్రాంగానికి కాసుల పండగ అందుకే ఇసుక మాఫియా కు అండ దండ గా వుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో ని క్వారీల్లో భారీ వాహనాల ద్వారా ఇసుకను తరలించేందుకు నది మధ్యలో అయిదు కిలోమీటర్ల వరకు రోడ్డు నిర్మించారు.. తెలంగాణ రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకు ఎక్కడా లేని స్వేచ్ఛ నిజామాబాద్ జిల్లాలో కనిపిస్తోంది…తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దుల్లో నిజామాబాద్ జిల్లాను ఆనుకుని ఉన్న మంజీరా నది ప్రతియేటా కోట్లాది రూపాయల విలువైన ఇసుక ను తవ్వేస్తుండడం తో ఆ నది జీవం కోల్పోతోంది.
పొతంగల్ మండలంలోని మంజీరా నది పరీవాహక ప్రాంతంలో మూడు క్వారీలు నడుస్తున్నాయి. పొతంగల్ గ్రామ పరిధిలోని క్వారీ ఓ భారీ సినిమా సెట్టింగును తలపిస్తోంది. ఇక్కడ తవ్వకాలు జరిపేందుకు పొక్లెయినర్, భారీ టిప్పర్లు, లారీలు సిద్ధంగా ఉన్నాయి. అయితే, ప్రభుత్వ పథకాల పేరిట వే బిల్లులు తీసుకుని, వాటి ద్వారా అక్రమ రవాణా చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్థాయిలో వీటికి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.
కానీ స్థానిక రెవెన్యూ అధికారులు ఇందిరమ్మ ఇళ్ళు, రోడ్లు, భవనాల నిర్మాణాల పేరిట ఇసుక అనుమతులు జారీ చేస్తున్నారు. అవి కూడా ఏరోజుకారోజు ఇవ్వాల్సి ఉండగా కొందరికి రోజుల తరబడి రాసిస్తున్నారు. వీటిని ఆధారంగా చేసుకుని మంజీర నదిని నిలువునా తోడేస్తున్నారు. ఒక్కో చోట 20 నుండి 40 మీటర్ల లోతు వరకు తవ్వకాలు జరిగాయి…పొతంగల్ గ్రామం నుండి ఒక కిలోమీటర్ దూరంలో మంజీర నదిపై వంతెన ఉంది.
ఇక్కడి నుండి మహారాష్ట్ర సరిహద్దు మొదలవుతుంది. వంతెన నుండి సుమారు 5 కిలోమీటర్ల లోపలికి వెళ్తే ఈ క్వారీ కనిపిస్తోంది. ఇక్కడ తవ్వుతున్న ఇసుకను రేయింబవళ్లు వందలాది వాహనాల ద్వారా బయటకు తరలిస్తున్నారు. ప్రతీరోజు సుమారు 250 లారీలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రవాణా కోసం అక్రమార్కులు ఏకంగా నది మధ్యలో రోడ్డు నిర్మించారు.
మంజీర నదిలో తవ్వి తీస్తున్న ఇసుక బోధన్ మార్గంలో హైదరాబాద్ వరకు తరలిపోతోంది. వీటిని ఎవరూ అడ్డుకోకుండా పోలీసు, రెవెన్యూ, మైన్స్ శాఖల అధికారులు అండగా ఉంటున్నారు. కొన్నిచోట్ల వందలాది లోడుల ఇసుక డంపులు ఏర్పాటు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ ఇసుక వాహనాల వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్లు దెబ్బతింటున్నాయి.
దీంతో ఈ ప్రాంతంలో సాధారణ రాకపోకలు ప్రమాదకరంగా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నిజామాబాద్ జిల్లా నేతలకు కాసుల పంట పండిస్తున్న ఇసుక అక్రమ దందాపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. నదులను నిర్జీవం చేస్తూ, పర్యావరణాన్ని దెబ్బ తీస్తున్న ఈ ఇసుక తోడేళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి. మామూళ్లకు మరిగిన అధికార యంత్రాంగం ఇకనైనా కళ్ళు తెరవాలి……
