రెండు రోజుల్లో ధాన్యం కొనుగోలు చేయకపోతే కలెక్టరేట్ ముట్టడి చేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి హెచ్చరించారు.గురువారం మోపాల్ మండలంలోని కంజర్, కులాస్పూర్, బాడ్సి తదితర గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను, రోడ్లపై ఉన్న ధాన్యం కుప్పలను బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్,డీఎస్ఓ అధికారులతో మాట్లాడి లారీ కొరత ఉంటే మాట్లాడి తెప్పించడం జరిగింది అని అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కులాస్పూర్‌లో రైతులు పంట కోసి 25 రోజులు గడుస్తున్నా ఇంతవరకు కొనుగోలు ప్రక్రియ ప్రారంభించకపోవడం శోచనీయం అన్నారు. వర్షాల వల్ల రోడ్లపై ఉన్న ధాన్యం తడిసి ముద్దవుతున్నా పట్టించుకునే నాథుడే లేడని అన్నారు.ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదని రైతులు అడిగితే బస్తాలు లేవు, లారీలు రావడం లేదు, సాఫ్ట్‌వేర్ సమస్య ఉందంటూ అధికారులు సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.
నుండి 25 రోజుల పాటు ధాన్యం రోడ్లపైనే ఎండడం వల్ల తరుగు ఏర్పడుతోంది. ఒక్కో బస్తాకు దాదాపు 5 కిలోల వరకు తరుగు వస్తోంది, దీనివల్ల రైతు క్వింటాలుకు రూ 300 వరకు నష్టపోతున్న రైతును ఆదుకోవాల్సింది పోయి, మరింత కుంగదీస్తున్నారు.
ఈ నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రభుత్వానికి వడ్లు కొనుగోలు చేయడం చేతకాకపోతే, రైతులు తక్కువ ధరకైనా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకొని తమ బాధ తాము పడేవారు. దొడ్డు రకం వడ్లు కొనబోమని అధికారులు చెప్పడం హాస్యాస్పదమినీ విమర్శించారు.
కొననప్పుడు ఆ విత్తనాలను రైతులకు ఎందుకు సరఫరా చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. సన్న, దొడ్డు రకం అనే వివక్ష లేకుండా ప్రతి గింజనూ ప్రభుత్వం మద్దతు ధరకు సేకరించాల్సిందే.
రాబోయే రెండు రోజులలోపు కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, రోడ్లపై ఉన్న ధాన్యాన్ని సేకరించకపోతే.. వేలాది మంది రైతులతో కలిసి జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు.
