ప్రమాదవశాత్తు రైలు నుంచి కింద పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన రైల్వే స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని కూకట్పల్లి ప్రాంతానికి చెందిన వకోడే శ్రీకాంత్ (41) సోమవారం తెల్లవారుజామున రైలులో ప్రయాణిస్తూ నిజామాబాద్ స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు కింద పడిపోయాడనీ తెలిపారు.
ఉదయం 5 గంటల సమయంలో స్టేషన్ ప్లాట్‌ఫారమ్-1 వద్ద రైల్వే ట్రాక్‌పై తీవ్ర గాయాలతో పడి ఉన్న శ్రీకాంత్‌ను గమనించిన స్టేషన్ మేనేజర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు వెంటనే 108 అంబులెన్స్‌లో క్షతగాత్రుడిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఉదయం శ్రీకాంత్ మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. మృతుడి వద్ద లభించిన ఆధారాల ద్వారా అతని వివరాలను సేకరించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయి రెడ్డి తెలిపారు.
