Monday, May 4, 2026
HomeCRIMEకుల బహిష్కరణ వేటు.. నాలుగేళ్లుగా అలుపెరగని పోరాటం!న్యాయం కోసం బాధితుల ఆవేదన.. పట్టించుకోని పోలీసులు, అధికార...

కుల బహిష్కరణ వేటు.. నాలుగేళ్లుగా అలుపెరగని పోరాటం!న్యాయం కోసం బాధితుల ఆవేదన.. పట్టించుకోని పోలీసులు, అధికార యంత్రాంగం..

పురుగుల మందు డబ్బాతో ప్రజావాణికి వచ్చిన బాధితురాలు ఆధునిక సమాజంలో కుల వివక్ష రూపుమాసిపోతుందని ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.

నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలం డికంపల్లి గ్రామంలో ఒక నిరుపేద దళిత కుటుంబంపై కుల బహిష్కరణ వేటు పడి నాలుగు ఏళ్లు గడుస్తున్నా, నేటికీ వారికి విముక్తి కలగలేదు. ఊరిలో ఉండనివ్వక, చావుకు రానివ్వక, కనీసం మాట్లాడే వారు లేక ఆ కుటుంబం సామాజిక వెలికి గురై నరకయాతన అనుభవిస్తోంది.ఈ మేరకు సోమవారం కలెక్టర్ ప్రజావాణికి వచ్చిన ఆమె, తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బాను బయటకు తీయడంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

న్యాయం చేయని ఈ బతుకు మాకొద్దంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ప్రభుత్వ సిబ్బంది ఆమె చేతిలో ఉన్న మందు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను సముదాయించి ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళ్లారు.

బాధితురాలు చిన్మల నల్లా తెలిపిన వివరాల ప్రకారం.. 2022లో సంక్రాంతి పండుగ అనంతరం పొరుగున ఉండే వ్యక్తులతో తలెత్తిన చిన్నపాటి వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. ఈ గొడవపై కుల పంచాయితీ కోరగా, గ్రామంలోని కొందరు ముఖ్య వ్యక్తులు ఏకపక్షంగా వ్యవహరించి సదరు కుటుంబాన్ని కుల బహిష్కరణ చేస్తున్నట్లు ప్రకటించారని అన్నారు.

అప్పటి నుంచి ఆ కుటుంబంతో ఎవరూ మాట్లాడకూడదని, శుభకార్యాలకు పిలవకూడదని హుకుం జారీ చేశారని తెలిపారు. కుల బహిష్కరణ ఎంతటి దారుణానికి దారితీసిందంటే.. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే మనస్తాపంతో బాధితురాలి బావ కోండ్రా సాయిలు మృతి చెందారు. కనీసం అంత్యక్రియలకైనా కులం వారు వస్తారని ఆశించిన ఆ కుటుంబానికి నిరాశే ఎదురైంది.

చావుకు ఎవరూ రాకపోగా, కుల సంప్రదాయం ప్రకారం డప్పులు కొట్టడానికి కూడా నిరాకరించారు. చివరకు బయటి వ్యక్తుల సాయంతో అంత్యక్రియలు నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది. దీనిపై నిలదీసినందుకు బాధితులను కట్టేసి కొట్టడం గమనార్హం.తమకు జరిగిన అన్యాయంపై బాధితులు మాక్లూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది.

పోలీసులు నిందితులకు కొమ్ముకాస్తూ, బాధితులపైనే ఎదురు కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు ముగ్గురు కలెక్టర్లు మారినా తమ గోడు వినేవారే లేరని, అంబేద్కర్‌ సంఘం నుంచి నోటీసులు వచ్చినా స్థానిక ప్రజాప్రతినిధులు వాటిని అడ్డుకుంటున్నారని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.

“మా తాతల కాలం నుండి ఇదే ఊరిలో ఉంటున్నాం. తప్పు చేయకపోయినా మమ్మల్ని వెలివేశారు. ఊరిలో అందరితో కలిసి జీవించే హక్కు మాకు లేదా?” అని చిన్మల నల్లా ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, తమకు న్యాయం చేసి, తిరిగి కులంలో కలిసేలా చూడాలని ఆమె వేడుకుంటున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!