అదనపు కట్నం కోసం భార్యను వేధించడమే కాకుండా, ఆమెను అంతమొందించేందుకు ప్రయత్నించిన భర్తకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లిలో జరిగిన ఈ ఘటనపై న్యాయస్థానం మంగళవారం కీలక తీర్పు వెలువరించింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జక్రాన్‌పల్లి మండలానికి చెందిన బాధితురాలికి 2023లో ప్రదీప్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. కాగా, ప్రదీప్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని, అదనపు కట్నం తీసుకురావాలని భార్యను నిత్యం శారీరక, మానసిక వేధింపులకు గురిచేసేవాడు.గతేడాది ఏప్రిల్ 11న రాత్రి సమయంలో భర్త ప్రదీప్ ఫోన్లో మాట్లాడుతుండగా..
“ఎవరితో మాట్లాడుతున్నావు” అని బాధితురాలు ప్రశ్నించింది. దీంతో ఆగ్రహానికి గురైన ప్రదీప్ ఆమెను చంపాలనే ఉద్దేశంతో మెడకు చీరతో ఉరివేసి ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఈ ఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జక్రాన్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు కోర్టులో పక్కా ఆధారాలు సమర్పించడంతో విచారణ అనంతరం నేరం రుజువైంది. న్యాయమూర్తి దుర్గాప్రసాద్,నిందితుడు ప్రదీప్‌కు 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 10,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. గృహ హింసకు పాల్పడే వారికి ఈ తీర్పు ఒక హెచ్చరిక అని న్యాయవర్గాలు పేర్కొన్నాయి.
నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు చేసిన అధికారులను జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ప్రత్యేకంగా అభినందించారు. మొదటి దర్యాప్తు అధికారి ఎస్.ఐ తిరుపతి,రెండో దర్యాప్తు అధికారి ఎస్.ఐ మాలిక్ రహమాన్, బ్రీఫింగ్ అధికారి ఎస్.ఐ మహేష్, కోర్టు లైయషన్ ఆఫీసర్ ఎస్.ఐ గోవింద్,కోర్టు డ్యూటీ ఆఫీసర్ రామారావు నేరస్తులకు శిక్ష పడేలా నిబద్ధతతో పనిచేసిన ప్రతి ఒక్కరినీ సీపీ కొనియాడారు.
