ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) సన్నాహక ప్రక్రియను ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో పక్కాగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు.
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఎస్.ఐ.ఆర్ మ్యాపింగ్ అమలు తీరు,పై కలెక్టర్ గురువారం నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో ఏ.ఈ.ఆర్.ఓలు, బీ.ఎల్.ఓ సూపర్వైజర్లతో సమీక్ష నిర్వహించారు. ఒక్కో పోలింగ్ కేంద్రం వారీగా ఎస్.ఐ.ఆర్ మ్యాపింగ్ అమలును పరిశీలిస్తూ, పనితీరులో వెనుకంజలో ఉన్న ఏ.ఈ.ఆర్.ఓలు, బీ.ఎల్.ఓ సూపర్వైజర్లను కారణాలు అడిగి తెలుసుకున్నారు.
అర్బన్ లో మ్యాపింగ్ ప్రక్రియ మందకొడిగా సాగడం వల్ల నిజామాబాద్ జిల్లా సగటుపై ఇది ప్రభావం చూపుతోందని అన్నారు. ఎస్.ఐ.ఆర్ అమలులో స్పష్టమైన ప్రగతి సాధించాల్సిందేనని స్పష్టం చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రం వారీగా బీఎల్ఓలతో మ్యాపింగ్ ను పక్కాగా జరిపించాలని, రోజువారీగా నిశిత పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు.
ఎస్.ఐ.ఆర్ సన్నాహక ప్రక్రియ అమలులో పురోగతిపై తాను వారం రోజుల తర్వాత మళ్ళీ సమీక్ష నిర్వహిస్తానని అన్నారు. స్పష్టమైన పురోగతి కనిపించాలని, ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, వారి వేతనాలు నిలిపివేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పనితీరు సక్రమంగా లేని ఇద్దరు ఆర్.పీలకు షోకాజ్ నోటీసులు అందించి విధుల నుండి తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
తన అనుమతి లేకుండా బీఎల్ఓ ల మార్పులు, చేర్పులు చేయకూడదని స్పష్టం చేశారు. ఓటరు జాబితాలో బోగస్ ఓటర్లు, చనిపోయిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లు ఉండరాదని, అదే సమయంలో అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుండి తప్పిపోకూడదని అన్నారు.
ఓటరు జాబితా పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రత్యేక సమగ్ర సవరణను ఎన్నికల సంఘం చేపట్టిందని అన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృత స్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకునేలా చూడాలని, మ్యాపింగ్ ప్రక్రియ పురోగతి కోసం వారి సహకారం తీసుకోవాలని సూచించారు.
ప్రత్యేక సమరణ ప్రక్రియ చేపట్టడం వల్ల ఓటరు జాబితాలో నిజమైన ఓటరు ఖచ్చితంగా ఉంటారని తెలిపారు. డూప్లికేట్ ఓటర్లతో పాటు మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిపోయిన, రెండు ఓట్లు ఉన్నవాళ్ల ఓట్లు మాత్రమే తొలగిస్తారని తెలిపారు.
ఎవరూ అపోహకు గురి కావద్దని కలెక్టర్ సూచించారు. ప్రత్యేక సమగ్ర సవరణ తరువాత ఎవరైనా ఓటు హక్కు రాని వారు ఉంటే ఆక్షేపణ చేయవచ్చని అన్నారు. సమీక్షలో నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజ్, నిజామాబాద్ సౌత్ తహసీల్దార్ శ్రీధర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
