HomeLaw and Orderఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు..కలెక్టర్ ఇలా త్రిపాఠి

ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు..కలెక్టర్ ఇలా త్రిపాఠి

ఈ నెల 13 నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వీ.సీ హాల్ లో కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష జరిపారు.

ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 17,789 మంది విద్యార్థినీ విద్యార్థులు హాజరుకానున్నారని కలెక్టర్ తెలిపారు.మొదటి సంవత్సరం పరీక్షలకు 11,425 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 6364 మంది హాజరుకానున్నారని వివరించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పరీక్షల నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా 39 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.

పరీక్షలు రెండు సెషన్లలో జరుగుతాయని, ప్రతీరోజు ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు ఫస్టియర్ పరీక్షలు, తిరిగి సాయంత్రం 2.30 గంటల నుండి 5.30 గంటల వరకు సెకండియర్ పరీక్షలు కొనసాగుతాయని అన్నారు. వార్షిక పరీక్షల తరహాలోనే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను కూడా సజావుగా, పకడ్బందీగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ప్రతీ అంశాన్ని కూలంకషంగా పరిశీలిస్తూ తుది ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. ముఖ్యంగా ప్రైవేటు సెంటర్లపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, ఎక్కడ కూడా కాపీయింగ్ కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. పోలీస్, ఆర్టీసీ, రెవెన్యూ, పోస్టల్, మెడికల్ అండ్ హెల్త్ తదితర లైన్ డిపార్ట్మెంట్ లకు చెందిన అధికారులు పరస్పర సమన్వయంతో పని చేయాలన్నారు.

ప్రశ్నపత్రాలను ఆయా రూట్ ల వారీగా పోలీసు బందోబస్తు మధ్య తీసుకెళ్లాలని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు చేస్తూ, తగిన పోలీసు బందోబస్తు ఉండేలా చూడాలన్నారు. పరీక్షలు జరిగే సమయంలో పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్ లను మూసి ఉంచాలని ఆదేశించారు.

వేసవి తీవ్రత దృష్ట్యా ప్రతి పరీక్షా కేంద్రంలోనూ తప్పనిసరిగా రక్షిత మంచినీటి వసతి అందుబాటులో ఉంచాలని, పరిశుభ్రమైన వాతావరణం నెలకొనెలా చర్యలు తీసుకోవాలని, తగినంత గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలని సూచించారు.

ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లతో ఆశా వర్కర్లు, ఏఎన్ఎం లను ఎగ్జామ్ సెంటర్లలో అందుబాటులో ఉంచాలని, మూడు పరీకా కేంద్రాలకు కలుపుకుని ఒకటి చొప్పున 108 అంబులెన్స్ లను కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు. పరీక్షలు కొనసాగే సమయాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని ట్రాన్స్ కో అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

విద్యార్థులకు రవాణా పరంగా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పరీక్షా సమయాలకు అనుగుణంగా బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు.

కాగా, పరీక్షలు ప్రారంభం అయ్యే నిర్ణీత సమయానికి ముందే విద్యార్థులు తమకు కేటాయించబడిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. విద్యార్థులు ఎలాంటి ఆందోనళకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.

విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆయా పరీక్షా కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఇన్విజిలేటర్లను నియమించాలని అన్నారు. కాపీయింగ్ ను నిరోధించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహించాలని అన్నారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవికుమార్, నిజామాబాద్ ఏసీపీ బి.ప్రకాష్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments