జిల్లా కేంద్రంలో ఈ నెల 13న జరగనున్న పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా 163 బీఎన్ఎస్ఎస్ (పాత 144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
నగర వ్యాప్తంగా మొత్తం 15 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఆయా కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల లోపు ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధమని సీపీ స్పష్టం చేశారు. పరీక్షలు జరిగే రోజున ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు.
పరీక్షా కేంద్రాలకు సమీపంలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ సెంటర్లు, స్టేషనరీ దుకాణాలను పరీక్షలు ముగిసే వరకు తప్పనిసరిగా మూసివేయాలని యజమానులను ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రతి కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తుతో పాటు అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచుతామని తెలిపారు.విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాసి విజయం సాధించాలని కోరుతూ ఆయన ‘ఆల్ ది బెస్ట్’ చెప్పారు.
