నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి దోపిడీఅమాయక పురుషులను మాటలతో నమ్మించి, నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి దోపిడీకి పాల్పడుతున్న దంపతుల ఆటకట్టించారు నిజామాబాద్ పోలీసులు. నిందితుల నుంచి నగదు స్వాధీనం చేసుకుని ఆదివారం రిమాండ్‌కు తరలించారు.
రూరల్ ఎస్హెచ్ఓ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా మఖేడ్ తాలుకాకు చెందిన మంగేష్ గైక్వాడ్ , అతడి భార్య ఉజ్వాల గైక్వాడ్ కొంతకాలంగా నిజామాబాద్‌లోని మాధవనగర్‌లో నివాసముంటున్నారు.
వీరిద్దరూ కాస్మెటిక్స్ విక్రయిస్తూనే సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. గత రెండు నెలలుగా బైపాస్, ఆర్మూర్ రోడ్డు పరిసరాల్లో మకాం వేసి అటుగా వెళ్లే వారిని లక్ష్యంగా చేసుకున్నారు. ఉజ్వాల రోడ్డుపై ఒంటరిగా నిలబడి అటుగా వెళ్లే పురుషులను ఆకర్షించేది. ఎవరైనా ఆమె మాటలు నమ్మి ఆగగానే, తన బైక్ ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లేది.
వెంటనే ఆమె భర్త మంగేష్ అక్కడకు చేరుకుని, తన భార్య వెంట ఎందుకు వచ్చావంటూ బాధితులను బెదిరించేవాడు. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే ‘అటెంప్ట్ రేప్’ కేసు పెడతామని భయపెట్టి వారి వద్ద ఉన్న నగదును దోచుకునేవారు.
బాధితుల ఫిర్యాదుతో నిఘా పెట్టిన పోలీసులు గోపన్ పల్లి కమాన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఈ దంపతులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తమ నేరాన్ని అంగీకరించడంతో వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్హెచ్ఓ శ్రీనివాస్ వెల్లడించారు.
