HomeLaw and Orderభారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి..అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు: సీపీ సీవీ సజ్జనర్

భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి..అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు: సీపీ సీవీ సజ్జనర్

నగరంలో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ సజ్జనర్ సూచించారు. వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, వాటికి అనుగుణంగా ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని ఆయన కోరారు.

భారీ వర్షాల నేపథ్యంలో గురువారం పంజాగుట్ట, ఖైరతాబాద్ జంక్షన్లలో ట్రాఫిక్ పరిస్థితులను సీపీ స్వయంగా పరిశీలించి, అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు శాఖ జీహెచ్‌ఎంసీతో పాటు ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయంగా పనిచేస్తోందని తెలిపారు.

ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా క్షేత్రస్థాయిలో సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారని చెప్పారు. వర్షం కురుస్తున్న సమయంలో తెరిచి ఉన్న మ్యాన్‌హోళ్లు, తెగిపడిన విద్యుత్ వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. లోతట్టు ప్రాంతాలు, ఫ్లైఓవర్ల వద్ద వాహనదారులు వేగం తగ్గించి అప్రమత్తంగా ప్రయాణించాలని కోరారు.

వాతావరణ శాఖ మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించిన నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప వర్షం సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సీపీ విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితులు లేదా ట్రాఫిక్ సహాయం అవసరమైతే డయల్–100కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

నగర ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా విడుదల చేసే ట్రాఫిక్ అడ్వైజరీలను పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments