2025-26 విద్యా సంవత్సరం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులదే ప్రముఖ పాత్ర అని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఇంటర్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంటుందని జిల్లా ఇంటర్ విద్యా అధికారి శ్రీ రవికుమార్ స్పష్టం చేశారు.
ఆదివారం నిజామాబాద్ బాలుర( ఖిల్లా) జూనియర్ కళాశాలలో ఉదయం చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, కస్టడియన్ లు, అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్ ల సమావేశము జరిగింది.జిల్లాలో 39 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని ఇంటర్ విద్యా అధికారి రవికుమార్ మాట్లాడుతూ అన్నారు.
ఇంటర్ బోర్డు కమిషనర్, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 13 నుండి 19 వరకు నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని అన్నారు.
చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు పరీక్షల నిర్వహణ లో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇంటర్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. సి. ఎస్., డి.ఓ.లు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాల్లో వెంటనే సీ. సీ. కెమెరాలు పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రశ్న పత్రాల బండిలను సి.సి. కెమరా ల ముందే ఓపెన్ చేయాలని ఆదేశించారు.
అందరూ సమయ పాలన చేయాలని అన్నారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు వెంటనే సమకూర్చాలని ఆదేశించారు. సెల్ ఫోన్ లను ఎట్టి పరిస్థితిలో పరీక్ష కేంద్రంలో అనుమతించే ప్రసక్తే లేదని, సి.ఎస్., డి. ఓ. లు కూడా పరీక్ష జరుగుతున్న సమయంలో పోలీస్ కస్టడీలోనే ఉంచాలని అన్నారు.
పరీక్షల నిర్వహణకు ముందే ఇన్విజిలేటర్ ల సమావేశం నిర్వహించి తగిన నియమ నిబంధనలు వివరించాలని సి.ఎస్., డి. ఓ. లను ఆదేశించారు.ప్రతి రోజు ఫ్లయింగ్, సిట్టింగ్, ఇంటర్ బోర్డు స్క్వాడ్ లతో పాటు జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు అన్ని పరీక్షా కేంద్రాలను తనిఖి చేస్తారని అన్నారు.
సి. ఎస్. , డి. ఓ. లు సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం మొదటి సంవత్సరం, మధ్యాహ్నం రెండవ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ఉంటాయని విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. పరీక్ష ప్రారంభం అయ్యాక అయిదు నిమిషాల వరకు విద్యార్థులను కేంద్రంలోకి అనుమతించవచ్చని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తెలియజేశారు.
విద్యార్థిని, విద్యార్థులను పరీక్షా హాలు లోకి పంపే ముందే క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపించే బాధ్యత సీ.ఎస్., డి.ఓ. లదేనని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ, విద్య శాఖ, విద్యుత్, ఆర్టీసీ, హెల్త్, పోస్టల్, పోలీస్ అధికారులతో ఇదివరకే సమన్వయ సమావేశం జరిగిందని, పరీక్ష కేంద్రాల వారీగా సి.ఎస్., డి.ఓ. లు సంబంధిత స్థానిక అధికారులకు తగిన ఏర్పాట్ల కోసం లెటర్ లు రాయాలని ఆదేశించారు.
పరీక్షల నిర్వహణకు ముందు, పరీక్ష జరుగుతున్న సమయంలో, పరీక్ష పూర్తయిన తరువాత తీసుకోవలసిన చర్యలను పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు శ్రీమతి నుస్రత్ జహాన్, శ్రీమతి రజియా సుల్తానా, ఖిల్లా బాలుర కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కాలిక్, బల్క్ అధికారి చిన్నయ్య లు తెలియజేశారు.
సమావేశంలో పరీక్షల నిర్వహణ కమిటీ అధికారులు, బల్క్ అధికారి శ్రీ చిన్నయ్య, బాలుర (ఖిల్లా) జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ ఖాలిక్ లు సి.ఎస్., డి. ఓ. లకు పరీక్షల నిర్వహణ బాధ్యతలను వివరించారు.
