హెచ్ పీవి టీకాలు, సీజనల్ వ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టిజిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్‌ఓ) డా. రాజశ్రీ శుక్రవారం మధ్యాహ్నం కిసాన్‌నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఓపీ నిర్వహణ, ఫార్మసీ, ప్రయోగశాల, హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కేంద్రాలను పరిశీలించారు. మందుల నిల్వలు, రోగుల నమోదు పుస్తకాలు, వైద్య పరీక్షల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆమె, సేవల నాణ్యతపై అధికారులకు పలు సూచనలు చేశారు.
వర్షాకాలంలో విరేచనాలు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, అనుమానిత కేసులను వెంటనే గుర్తించి చికిత్స అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.
అర్హులైన బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయాలని, వ్యాక్సినేషన్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ తనిఖీల్లో పీహెచ్‌సీ వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
