పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం పాటు నిష్కళంకంగా సేవలందించి, విధి నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచిన సీఐడీ ఇన్‌స్పెక్టర్ ఆంజనేయులు శుక్రవారం పదవీ విరమణ చేశారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో ఆయన వీడ్కోలు మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ అభినందన సభలో సీఐడీ డీఐజీ పరిమళ హనా నూతన్, హైదరాబాద్ సీఐడీ ఎస్పీ డాక్టర్ నవీన్ కుమార్ (ఐపీఎస్), సీఐడీ అడ్మిన్ ఎస్పీ మద్దిపాటి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో సుదీర్ఘమైన 42 ఏళ్ల పాటు ఎటువంటి మచ్చలేకుండా, అత్యంత నిబద్ధత, సమర్థతతో సేవలు అందించడం కత్తి మీద సాములాంటిదని ప్రశంసించారు. తన సుదీర్ఘ అనుభవంతో శాఖలో ఆంజనేయులు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు.
ఆయన చేసిన విశిష్ట సేవలను స్మరించుకుంటూ.. అధికారులు ఆంజనేయులును శాలువా కప్పి, జ్ఞాపిక అందజేసి ఘనంగా సత్కరించారు. భవిష్యత్తులోనూ ఆయన ఆరోగ్యం, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
