HomeTelanganaNizamabadఇందూర్‌కు సీఎం పంగనామాలు: ఎంపీ ధర్మపురి అరవింద్

ఇందూర్‌కు సీఎం పంగనామాలు: ఎంపీ ధర్మపురి అరవింద్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతూ ఇందూర్ జిల్లాకు పంగనామాలు పెడుతున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇందూర్‌కు ఔటర్ రింగ్ రోడ్ ఇస్తానని నమ్మబలికి, అధికారంలోకి వచ్చాక ఆ మాటను పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డారు.

సోమవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. “టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను రాజకీయంగా అనగదొక్కేందుకే సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు మొండిచేయి చూపిస్తున్నారని ఆరోపించారు. ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు బుల్లెట్ రైల్ కారిడార్ విషయంలోనూ సీఎం అబద్ధాలు చెప్తున్నారు.

అసలు జిల్లాకు ఏం చేశారని పీసీసీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారులు, రూరల్ కాంగ్రెస్ నేతలు ఏ మొఖం పెట్టుకొని ప్రజల్లో తిరుగుతున్నారు? అది చేస్తా.. ఇది చేస్తానని మాయమాటలు చెప్పి, దేవుళ్ల మీద ఒట్లు వేసి సాక్షాత్తూ భగవంతుడినే మోసం చేసిన రేవంత్ రెడ్డికి..

ప్రజలను మోసం చేయడం ఒక లెక్కా? ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉందనే కనీస జ్ఞానం లేదా అని ప్రశ్నించారు.”గతంలో నిజామాబాద్ నగరాన్ని అప్‌గ్రేడ్ చేస్తానని మాయమాటలు చెప్పిన కేసీఆర్‌ను ప్రజలు ఎలాగైతే ఫామ్‌హౌస్‌ (గెస్ట్ హౌస్)లో కూర్చోబెట్టారో.. రేవంత్ రెడ్డికి కూడా అదే గతి పడుతుంది.

ఇంకా ఉనికిలోనే లేని ‘ఫ్యూచర్ సిటీ’ గురించి సీఎం చెప్తున్న మాటలను ప్రజలు ఎలా నమ్ముతారు 2034 వరకు నేనే సీఎం అంటూ రేవంత్ రెడ్డి పగటి కలలు కంటున్నారు. అసలు 2039 దాకా రాహుల్ గాంధీ ప్రధాని కాలేరని రేవంత్ స్వయంగా ఒప్పుకున్నారు.

ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి కల్లబొల్లి మాయ మాటలు మాట్లాడడం మానుకుంటే మంచిది.” కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఎప్పటికీ పూర్తికావని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నగర డ్రైనేజీ పనుల దుస్థితిపై ఆయన గణాంకాలను విడుదల చేశారు: మొత్తం అంచనా వ్యయం సుమారు రూ. 163 కోట్లు, పూర్తయిన పనులు: ఇప్పటివరకు కేవలం 25 శాతం మాత్రమే పనులు పూర్తి అయ్యాయని తెలిపారు.గత రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఇచ్చింది కేవలం రూ. 10 కోట్లు మాత్రమే. “ఇదా ఇందూర్ నగరంపై సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి నిజామాబాద్ జిల్లా ప్రజలను మోసం చేస్తే ఊరుకునేది లేదు.

జిల్లా అభివృద్ధి కోసం నిధుల సాధనకై పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం.” అని అరవింద్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం తప్పదని అరవింద్ జోస్యం చెప్పారు. 2029 ఎన్నికల్లో రాష్ట్రంలో ‘హైటెన్షన్’ రాజకీయాలు ఉంటాయని పేర్కొన్నారు.

ఈ విలేకరుల సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి, బీజేపీ రాష్ట్ర నాయకులు, కార్పొరేషన్ మాజీ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments