నిజామాబాద్‌లో మూలాలు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు ప్రాథమిక గుర్తింపుఇంట్లో రూ.1.10 కోట్ల నగదు, కిలో బంగారం స్వాధీనం గేటెడ్ కమ్యూనిటీల్లో ఫ్లాట్లు, ప్లాట్లు.. బ్యాంకు లాకర్లపై గురిఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై రెడ్‌హిల్స్ జలమండలి జనరల్ మేనేజర్ అనంత్ లక్ష్మీకుమార్ నివాసం, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు.
ఈ సోదాల్లో నివ్వెరపోయే నిజాలు వెలుగుచూశాయి. కుమార్ అధికార దుర్వినియోగానికి పాల్పడి భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది. ప్రస్తుతం మార్కెట్ విలువల ప్రకారం వీటి విలువ సుమారు రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్‌లోని కుమార్ నివాసంతో పాటు ఆయనకు అత్యంత ఆప్తులు, బంధువుల ఇళ్లతో కలిపి మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు తెల్లవారుజాము నుంచే తనిఖీలు చేపట్టాయి. నిజామాబాద్ జిల్లాతో కుమార్ కుటుంబానికి ఉన్న పాత సంబంధాల నేపథ్యంలో.. అక్కడ కూడా ఏసీబీ నిఘా పెట్టి సోదాలు నిర్వహించింది. అక్రమ సంపాదనను బంధువుల పేర్లపై బినామీ ఆస్తులుగా మార్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
అలాగే 3 ఎకరాల భూమి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.నిజామాబాద్ జిల్లా పరిధిలో కుమార్ పేరిట, ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న 3 ఎకరాల విలువైన భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ తనిఖీల్లో కుమార్ ఇంట్లోనే లెక్కల్లో చూపని రూ.1 కోటి 10 లక్షల నగదు (క్యాష్) లభ్యమైంది. దీంతో పాటు సుమారు 1 కేజీ బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీల్లో 3 విలాసవంతమైన ఫ్లాట్లు, అలాగే వివిధ ప్రాంతాల్లో 6 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు పత్రాలను గుర్తించారు.
ఇప్పటివరకు లభించిన ఆస్తులు కేవలం ప్రాథమికంగా గుర్తించినవేనని ఏసీబీ ఉన్నతాధికారులు తెలిపారు. కుమార్ పేరిట వివిధ బ్యాంకుల్లో ఉన్న లాకర్లను ఇంకా తెరవాల్సి ఉందని, వాటిని బుధవారం పరిశీలించనున్నట్లు వెల్లడించారు.
ఆ లాకర్లు ఓపెన్ చేస్తే మరిన్ని నగదు, బంగారు ఆభరణాలతో పాటు అదనపు బినామీ ఆస్తుల పత్రాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన ఏసీబీ.. కుమార్ అక్రమ సంపాదన వెనుక ఉన్న ఇతర సూత్రధారులపై కూడా నిఘా పెట్టింది.
