HomeCRIMEమూగజీవాల అక్రమ రవాణాపై డేగకన్ను

మూగజీవాల అక్రమ రవాణాపై డేగకన్ను

  • అర్ధరాత్రి వేళ సరిహద్దు చెక్‌పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ సాయి చైతన్య
  • మహారాష్ట్ర సరిహద్దుల్లో 24/7 పటిష్ట నిఘా ఉంచాలని ఆదేశం
  • బక్రీద్‌ నేపథ్యంలో ముమ్మర తనిఖీలు

రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకొని జిల్లా సరిహద్దుల్లో పోలీస్ యంత్రాంగం నిఘాను ముమ్మరం చేసింది. గురువారం అర్ధరాత్రి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, క్షేత్రస్థాయిలో పర్యటించి భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. రెంజల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కందకుర్తి గ్రామ మహారాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్‌తో పాటు జాన్కంపేట, పాల్ద జన్నాపల్లి చెక్‌పోస్టులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పండుగ నేపథ్యంలో మూగజీవాల రవాణా, ఇతర వాహనాల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని అక్కడి సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా సీపీ విధుల్లో ఉన్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. మహారాష్ట్ర సరిహద్దు కావడంతో నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని నిశితంగా పరిశీలించాలని స్పష్టం చేశారు.

బక్రీద్ పండుగ ముసుగులో జరిగే అక్రమ రవాణా, నిషేధిత పదార్థాల సరఫరా, అక్రమ నగదు చలామణి, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై 24/7 డేగకన్ను వేయాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అవసరమైతే అత్యాధునిక సాంకేతిక పరికరాల సహాయంతో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో సరిహద్దు చెక్‌పోస్టులు కీలక పాత్ర పోషిస్తాయి. రాత్రి వేళల్లో విధులు నిర్వహించే సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి.

వాహనాల తనిఖీల సమయంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రజలతో అత్యంత మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సీపీ సిబ్బందికి సూచించారు. అదే సమయంలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే సిబ్బంది తమ సొంత భద్రత విషయంలోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు.

రాత్రి సమయాల్లో తప్పనిసరిగా రిఫ్లెక్టర్ జాకెట్లు ధరించాలని, సరైన భద్రతా పరికరాలను ఉపయోగించాలని తెలిపారు. పరస్పర సమన్వయంతో పనిచేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలన్నారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో సీపీ వెంట స్థానిక పోలీస్ అధికారులు, స్పెషల్ పార్టీ సిబ్బంది, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments