HomeTelanganaNizamabadఆధునిక బస్టాండ్ కల అటకెక్కేనా?నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తీవ్ర నిరాశలో ప్రయాణికులు..రాజకీయ వివాదాల సుడిగుండంలో కొత్త...

ఆధునిక బస్టాండ్ కల అటకెక్కేనా?నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తీవ్ర నిరాశలో ప్రయాణికులు..రాజకీయ వివాదాల సుడిగుండంలో కొత్త బస్టాండ్ నిర్మాణం

జిల్లా కేంద్రంలో సరికొత్త బస్టాండ్‌ నిర్మాణం ‘మూడు ప్రతిపాదనలు.. ఆరు వివాదాలు’ అన్న చందంగా మారింది. నానాటికీ పెరుగుతున్న జనాభా, ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా ఆధునిక హంగులతో కొత్త బస్టాండ్‌ నిర్మిస్తామంటూ పాలకులు చెబుతున్న మాటలు క్షేత్రస్థాయిలో నీటి మూటలుగానే మిగిలిపోయాయి.

ప్రతిరోజూ దాదాపు 650 బస్సులు రాకపోకలు సాగించే నిజామాబాద్‌ డిపో పరిధిలో ప్రయాణికుల అవసరాలను గాలికొదిలేశారు. బస్టాండ్‌ ఆధునికీకరణకు నిధులు మంజూరవుతున్నా.. నూతన భవన నిర్మాణ పనుల్లో మాత్రం చలనం కరువైంది.

తాజాగా బస్టాండ్‌ కోసం ప్రతిపాదించిన స్థలాన్ని అధికార పార్టీ కార్యాలయానికి కేటాయించారనే అంశం ఇప్పుడు జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది.ప్రస్తుతం నడుస్తున్న పాత ఆర్టీసీ బస్టాండ్‌ను ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ జనరల్ ఆసుపత్రికి అప్పగించాల్సి ఉంది.

గతంలో ఇక్కడ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనుమతి ఇచ్చే క్రమంలో.. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బస్టాండ్ స్థలాన్ని ఆసుపత్రి పార్కింగ్ ఏరియాగా చూపిస్తూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి లిఖితపూర్వక హామీ ఇచ్చింది. దీంతోనే కాలేజీకి పర్మిషన్ వచ్చింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనూ ఈ స్థలాన్ని మెడికల్ కౌన్సిల్‌కు బదిలీ చేసేందుకు నిర్ణయించారు.

ఈ నేపథ్యంలోనే పాత బస్టాండ్‌ను వేరే ప్రాంతానికి తరలించడం.. కొత్త బస్టాండ్ నిర్మాణం చేపట్టడం అనివార్యంగా మారింది.గత ప్రభుత్వ హయాంలో నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే, అప్పటి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే స్టేషన్‌ను ఆనుకుని ఉన్న రోడ్డు భవనాల శాఖ (R&B) కార్యాలయాల కాంప్లెక్స్ స్థలాన్ని నూతన బస్టాండ్ నిర్మాణం కోసం ప్రతిపాదించారు.

రైలు, బస్సు ప్రయాణాలకు కనెక్టివిటీ బాగుంటుందని భావించి ఈ స్థలాన్ని కేటాయించారు. ఇక్కడే అన్ని హంగులతో ఆధునిక బస్టాండ్ నిర్మించాలని ప్లాన్ సిద్ధం చేశారు.గత ప్రభుత్వం బస్టాండ్ కోసం ప్రతిపాదించిన ఈ విలువైన స్థలాన్ని.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమ జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణానికి కేటాయించడంపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

జిల్లా కేంద్రంలో ప్రయాణికుల రద్దీతో పాత బస్టాండ్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. 650 బస్సుల నిర్వహణ, పార్కింగ్ ఇబ్బందులతో నిత్యం ట్రాఫిక్ జామ్‌లు నరకం చూపిస్తున్నాయి. బస్టాండ్ల ఆధునికీకరణ నిధులు పక్కనపడిపోవడం, స్థల వివాదాల కారణంగా పనులు నిలిచిపోవడంపై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజా అవసరాలకే ప్రాధాన్యత ఇచ్చి, నిజామాబాద్‌కు కొత్త బస్టాండ్ నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments