రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు మానాల నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయం (కాంగ్రెస్ భవన్)లో నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఉమారాణి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హాందాన్, రాష్ట్ర కల్లుగీత కార్మిక కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత లు పీసీసీ అధ్యక్షుల జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం నుంచే నగరంలోని కంటేశ్వర్ శివాలయం, శంభు గుడి, కోటగల్ మార్కండేయ ఆలయాల్లో కాంగ్రెస్ శ్రేణులు మహేష్ కుమార్ గౌడ్ పేరిట ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.
స్థానిక సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.నగేష్ రెడ్డిఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాకు చెందిన మహేష్ కుమార్ గౌడ్ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ పీసీసీ అధ్యక్షుడి స్థాయికి చేరడం జిల్లా కాంగ్రెస్ శ్రేణులందరికీ గర్వకారణమన్నారు.
1987లో కరాటే మాస్టర్‌గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్‌లోని నాయకత్వ లక్షణాలను, యువతలో ఆయనకున్న క్రేజ్‌ను గుర్తించి మాజీ మంత్రి, స్వర్గీయ డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారని గుర్తుచేశారు.
ఆ తర్వాత క్రమశిక్షణ గల కార్యకర్తగా ఉంటూ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ఎన్ఎస్ యుఐ అధ్యక్షుడిగా, పీసీసీ ప్రధాన కార్యదర్శిగా, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీకి అంకితభావంతో సేవలు అందించారని కొనియాడారు. గత ఎన్నికల సమయంలో గాంధీ భవన్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి, పార్టీ అధికారంలోకి రావడానికి శ్రమించారన్నారు.
ఇటీవల ఒక న్యూస్ ఛానల్లో పీసీసీ అధ్యక్షుడిపై వచ్చిన వార్తలు కేవలం దుష్ప్రచారమేనని నగేష్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరూ కలిసికట్టుగా ప్రభుత్వ, పార్టీ బాధ్యతలను ముందుకు తీసుకెళ్తున్నారని, రాబోయే రోజుల్లోనూ తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా కార్యకర్తలంతా మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో పనిచేస్తారని స్పష్టం చేశారు.
ఈ వేడుకల్లో పీసీసీ ప్రధాన కార్యదర్శి వేద రజనీకాంత్ (రామ్‌భూపాల్), రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు రామకృష్ణ, డీసీసీ కోశాధికారి భక్తవత్సలం, సీనియర్ నాయకులు రత్నాకర్, ఆకుల లలిత, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు సంతోష్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
