ఆర్మూర్ పట్టణంలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. తన బాబాయ్ ఇంట్లో చోరీకి పథకం పన్నిన ప్రధాన నిందితుడితో పాటు మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 31.48 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులు మరియు నగదును స్వాధీనం చేసుకున్నారు.
సోమవారం జిల్లాలోని కమీషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వివరాలు వెల్లడించారు.ఆయన మాట్లాడుతూ..గత నెల 24న ఆర్మూర్ పట్టణంలో రూ. 41.31 లక్షల విలువైన బంగారం, వెండి, నగదు చోరీకి గురైనట్లు బాధితులు ఆర్మూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు తీవ్రతను గుర్తించిన అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆర్మూర్ బ్రాహ్మణపల్లి ఎక్స్ రోడ్డు వద్ద కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని తనిఖీలు నిర్వహించారు.
నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బయటపడింది.నిందితుడు విజయ్ అగర్వాల్ (A1), ఆర్మూర్ మహాలక్ష్మి కాలనీలో ఉన్న తన బాబాయ్ కుటుంబ సభ్యులు వేములవాడకు వెళ్లిన సమయాన్ని ఆసరాగా చేసుకున్నాడు.
ఆ సమయంలో ఇంట్లో చోరీ చేయాలని పథకం పన్ని, ఏ2 సల్మాన్ ఖాన్, ఏ3 మంజల్ సాయి కుమార్, పరారీలో ఉన్న ఏ4 శ్రీహరిలను డబ్బులకు ఒప్పందం చేసుకున్నాడు. వీరి ద్వారా ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, నగదును దొంగిలించాడు.
నిందితులు చోరీ చేసిన సొమ్ములో కొంత మొత్తాన్ని ఇప్పటికే ఖర్చు చేయగా, మిగిలిన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నిందితుల నుంచి 580 గ్రాముల బంగారం ముద్దలు, 10 గ్రాముల బంగారు చైన్, 300 గ్రాముల వెండి లక్ష్మి బిళ్ళలు, 50 గ్రాముల వెండి ప్లేటు, రూ. 19.33 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ. 31.48 లక్షల విలువైన సొత్తును పోలీసులు రికవరీ చేశారు.
చోరీ చేసిన సొమ్ములో కొంత మొత్తాన్ని నిందితులు ఖర్చు చేయగా, మిగిలిన సొత్తు పరారీలో ఉన్న నిందితుడి వద్ద ఉన్నట్లు గుర్తించారు.ప్రధాన నిందితుడు విజయ్ అగర్వాల్‌పై ఇప్పటికే ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఏడు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని, అతని నేర ప్రవృత్తిని దృష్టిలో ఉంచుకుని గతంలోనే రౌడీ షీట్ తెరిచినట్లు పోలీసులు తెలిపారు.
కేసును వేగంగా ఛేదించిన ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, టౌన్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ, సీసీఎస్ ఇన్స్పెక్టర్ సాయినాథ్, సిబ్బంది అమరేందర్, కిరణ్ కుమార్, సతీష్, అశోక్, అన్వేష్‌లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రత్యేకంగా అభినందించారు.
