నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఘనత నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యులు మరో కీలక మైలురాయిని అధిగమించారు. వైద్య సేవల్లో నిత్యం కొత్త పుంతలు తొక్కుతున్న ఆసుపత్రిలో, తొలిసారిగా ప్లాస్టిక్ సర్జరీ శస్త్రచికిత్సను అత్యంత విజయవంతంగా నిర్వహించి తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు.
గాంధారి మండలానికి చెందిన లచ్చవ్వ (45) అనే మహిళ కొంతకాలంగా ముఖం ఎడమ చెంప భాగంలో ఇబ్బంది పడుతుండటంతో ఆసుపత్రికి వచ్చారు. వైద్య పరీక్షల్లో ఆమెకు ‘బేసల్ సెల్ కార్సినోమా’ఉన్నట్లు గుర్తించారు. దీనికి చికిత్స అవసరమని భావించిన ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శివాని మరియు బృందం, ఆమెకు ‘రొటేషన్ ఫ్లాప్ రీకన్స్ట్రక్షన్’ సర్జరీ చేయాలని నిర్ణయించారు.
శస్త్రచికిత్స విభాగం హెడ్ డాక్టర్ విజయ్ కుమార్ పర్యవేక్షణలో డాక్టర్ శివాని ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. సుమారు గంటల పాటు శ్రమించి నిర్వహించిన ఈ శస్త్రచికిత్స తర్వాత రోగి ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని, కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటువంటి ప్రత్యేక శస్త్రచికిత్స జరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.వి. నాగమోహన్ మాట్లాడుతూ.. సామాన్యులకు అత్యాధునిక వైద్యం అందించడమే లక్ష్యంగా తాము పని చేస్తున్నామని తెలిపారు. ఈ శస్త్రచికిత్స విజయవంతం కావడంతో ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జరీ విభాగం సేవలు మరింత విస్తృతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
సంక్లిష్టమైన శస్త్రచికిత్సను సమర్థవంతంగా నిర్వహించిన డాక్టర్ శివాని, డాక్టర్ విజయ్ కుమార్, వైద్య బృందాన్ని సూపరింటెండెంట్ అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రజల్లో నమ్మకం పెంచేలా వైద్యుల పనితీరు ఉందని రోగులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
