పిట్లంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన వ్యక్తి మృతి చెందడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మరణం సంభవించిందని మృతుని బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
నిజాంసాగర్ మండలం నర్సింగ్ రావుపల్లికి చెందిన కే. సాయిలు గత కొంతకాలంగా జ్వరంతో బాధపడుతున్నారు. మెరుగైన చికిత్స కోసం ఆయన పిట్లంలోని సదరు ఆసుపత్రికి వచ్చారు. అయితే, అక్కడ వైద్యులు సాయిలుకు రెండు ఇంజక్షన్లు ఇచ్చిన కొద్దిసేపటికే ఆయన ప్రాణాలు కోల్పోయారని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
ఆరోగ్యంగా ఆసుపత్రికి వచ్చిన సాయిలు, ఇంజక్షన్లు వేసిన వెంటనే చనిపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుల చికిత్సలో లోపం వల్లే వ్యక్తి మృతి చెందారని వారు ఆరోపిస్తున్నారు.
మృతికి గల అసలు కారణాలను వెల్లడించాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
