చర్యలు లేవా?విద్యను వ్యాపారంగా మార్చిన కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు నిజామాబాద్ జిల్లాలో నిబంధనలను బేఖాతరు చేస్తున్నాయి. విద్యాశాఖ నుంచి కనీస అనుమతులు, గుర్తింపు లేకపోయినా.. అడ్మిషన్ల పేరుతో తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తూ కాసుల వేట సాగిస్తున్నాయి.
రంగురంగుల బ్రోచర్లు, ఆకర్షణీయమైన ప్రకటనలతో ప్రచారాలు హోరెత్తిస్తూ, ప్రభుత్వ ఆదేశాలను సైతం లెక్కచేయకుండా యథేచ్ఛగా అడ్మిషన్లు చేపడుతున్నాయి. జిల్లాలోని సదరు ప్రముఖ కార్పొరేట్ విద్యాసంస్థలకు సంబంధించిన పలు బ్రాంచీలకు విద్యాశాఖ నుంచి ఎలాంటి అధికారిక అనుమతులు లేవనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే మాయమాటలతో, రంగురంగుల బ్రోచర్లు, హోర్డింగులతో ప్రచారాలు హోరెత్తిస్తూ అడ్మిషన్లు గుంజుకుంటున్నారు.
నిబంధనల ప్రకారం విద్యాశాఖ అనుమతి ఉంటేనే విద్యార్థులను చేర్చుకోవాల్సి ఉండగా.. ఆ నియామకాలను సదరు యాజమాన్యాలు గాలికొదిలేశాయి. తాము చెప్పిందే చట్టం, చేసిందే నియమం అన్నట్లుగా వ్యవహరిస్తున్న వైనంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అనుమతులు లేని పాఠశాలల్లో అడ్మిషన్లు ఎలా చేపడతారంటూ విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సదరు స్కూళ్ల వద్ద ఆందోళనలు నిర్వహించిన విపక్ష, విద్యార్థి సంఘాల నేతలు.. కార్పొరేట్ శక్తుల దోపిడీపై మండిపడ్డారు.
జిల్లా విద్యాశాఖ అధికారి సదరు పాఠశాలల్లో అడ్మిషన్లు తీసుకోవద్దని, అక్కడ ఎలాంటి అనుమతులు లేవని స్పష్టంగా తేల్చిచెప్పినప్పటికీ.. యాజమాన్యాల్లో చలనం లేదు.
డీఈఓ ఆదేశాలను సైతం తృణీకరిస్తూ క్షేత్రస్థాయిలో యథేచ్ఛగా అడ్మిషన్ల ప్రక్రియను కొనసాగిస్తూనే ఉన్నారు. అధికార యంత్రాంగం కేవలం హెచ్చరికలకే పరిమితం కావడం వల్లే కార్పొరేట్ యాజమాన్యాలు ఇంతలా బరితెగిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే, ఈ వ్యవహారంలో విద్యాశాఖ అధికారుల తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు సంస్థలు ఇంత బహిరంగంగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నా అధికారులు కేవలం ప్రకటనలకే పరిమితం కావడం వెనుక అంతర్యమేమిటని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
“అనుమతులు లేవని చెప్తున్న అధికారులు, ఆ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? వారిపై చర్యలు తీసుకోకుండా కేవలం ‘చేరవద్దు’ అని ప్రకటనలు ఇచ్చి చేతులు దులుపుకోవడం వెనుక ఏవైనా ‘అండదండలు’ ఉన్నాయా?” అంటూ నేతలు నిలదీస్తున్నారు.
కార్పొరేట్ బ్రాండ్ల మోజులో పడి లక్షల ఫీజులు కడుతున్న తల్లిదండ్రులు ఇప్పుడు డీఈఓ ప్రకటనతో ఆందోళనలో పడ్డారు. అనుమతులు లేని పాఠశాలల్లో చదివితే రేపు సర్టిఫికెట్ల పరిస్థితి ఏంటని నీళ్లు నములుతున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, నోటీసులతో కాలయాపన చేయకుండా.. నిబంధనలు తుంగలో తొక్కుతున్న సదరు విద్యాసంస్థలను తక్షణమే సీజ్ చేయాలని జిల్లా విద్యా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.
అనుమతులు లేని పాఠశాలలపై కఠిన చర్యలు: డీఈఓ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ స్పష్టం చేశారు.
జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల అనుమతులు, భవన భద్రత, ఫైర్ సేఫ్టీ పత్రాలను నిరంతరం పరిశీలిస్తున్నామని తెలిపారు.తల్లిదండ్రులు కూడా అన్ని అనుమతులు ఉన్న పాఠశాలల్లో మాత్రమే తమ పిల్లలను చేర్పించాలని కోరారు నిబంధనలు ఉల్లంఘించి, ఒకే అనుమతితో బ్రాంచ్‌లు నడుపుతున్నా లేదా నివాస భవనాల్లో అక్రమంగా స్కూల్స్ నిర్వహిస్తున్నా వాటిపై తక్షణమే విచారణ జరిపిస్తామన్నారు.
విద్యార్థుల భవిష్యత్తు, భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అనుమతులు లేని ప్రైవేట్ స్కూల్స్‌పై చర్యలు తీసుకోండి: టీజీవీపీ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని టీజీవీపీ జిల్లా అధ్యక్షులు కళ్యాణ్ డిమాండ్ చేశారు.
పాఠశాలలకు ఉండాల్సిన గుర్తింపు, ఫైర్ సేఫ్టీ, భవన భద్రతా సర్టిఫికెట్లు లేకపోయినా విద్యాశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఒకే పేరుతో నాలుగైదు బ్రాంచ్‌లు నడుపుతూ విద్యను వ్యాపారంగా మార్చారని అభ్యంతరం వ్యక్తం చేశారు.
విద్యాశాఖ అధికారుల అవినీతిపై ఏసీబీ విచారణ జరిపించాలని, నిబంధనలు ఉల్లంఘించిన విద్యాసంస్థలపై తక్షణమే కేసులు నమోదు చేయాలని కళ్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
