నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 12వ వార్డులో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందని, దీనిపై మున్సిపల్ అధికారులు స్పందించడం లేదని తెలంగాణ జన సమితి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ జఫర్ అలీ ఆరోపించారు.
ఈ మేరకు శుక్రవారం మున్సిపల్ కమిషనర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వార్డులో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా శుభ్రం చేయకపోవడంతో మురుగునీరు నిలిచిపోయి, దుర్వాసన వస్తోందని, తద్వారా దోమలు పెరిగి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
సమస్యను మున్సిపల్ అధికారి దృష్టికి తీసుకెళ్లగా, 5,000 మంది జనాభా ఉన్న వార్డుకు కేవలం ఇద్దరు, ముగ్గురు పారిశుధ్య కార్మికులు మాత్రమే ఉన్నారని, సమస్యను పరిష్కరించలేమని ఆయన సమాధానమిచ్చారని జఫర్ అలీ పేర్కొన్నారు.
ప్రజా సమస్యల పట్ల మున్సిపల్ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు బాధ్యతారాహిత్యంగా ఉందని ఆయన విమర్శించారు. వార్డులో వెంటనే డ్రైనేజీలను శుభ్రం చేయించాలని, పారిశుధ్య లోపంపై విచారణ చేపట్టాలని జఫర్ అలీ డిమాండ్ చేశారు.
అలాగే, అన్ని వార్డుల్లో తగినంత మంది కార్మికులను నియమించాలని, సిబ్బంది పట్ల పర్యవేక్షణ పెంచి ప్రజల ఫిర్యాదులకు సత్వరమే స్పందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
