నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంజర్ గ్రామ పరిధిలోని శ్రీ బడా రాం మఠానికి చెందిన వ్యవసాయ భూముల కౌలు బహిరంగ వేలం బుధవారం ఉత్సాహంగా సాగింది. దేవాదాయ-ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేలంలో స్థానిక రైతులు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గ్రామ శివారులోని సర్వే నంబర్లు 849/1లో 1 ఎకరం 29 గుంటలు, 851లో 12 ఎకరాల 34 గుంటలు.. ఇలా మొత్తం 14 ఎకరాల 13 గుంటల భూమిని రెండేళ్ల కాలపరిమితితో కౌలుకు ఇచ్చేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. కంజర్ గ్రామ సచివాలయ కార్యాలయం వద్ద బుధవారం ఉదయం 10 గంటలకు నిర్వహించిన ఈ బహిరంగ వేలంలో రామ్మర్తి సమత (భర్త సునీల్ కుమార్) అత్యధికంగా రూ.17,51,000/- (పదిహేడు లక్షల యాభై ఒక్క వేల రూపాయలు) పాడి హెచ్చుపాటదారుగా నిలిచారు.
ఈ వేలం ప్రక్రియను మఠం ఫిట్ పర్సన్ జి. వేణు పర్యవేక్షించగా, పరిశీలకులుగా జి. సుజాత రెడ్డి వ్యవహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మోపాల్ మండల తహసీల్దార్ ఆధ్వర్యంలో, స్థానిక ఎస్.హెచ్.ఓ. పర్యవేక్షణలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో పలు ఆలయాల జూనియర్ అసిస్టెంట్లు ఎస్. ఆంజనేయులు, టి. ప్రశాంత్ కుమార్, కె. రఘునాథ్, ఎ. సుమన్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
