ప్రజల్లో పోలీసులపై విశ్వాసం పెరిగేలా ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది నిక్కచ్చిగా విధులు నిర్వర్తించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. మంగళవారం టౌన్-3 పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన.. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, వివిధ కేసుల ఫైళ్లను పరిశీలించిన కమిషనర్.. దర్యాప్తులో ఉన్న కేసులను ప్రత్యేక కార్యాచరణతో వేగంగా పూర్తి చేయాలని, ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని సూచించారు.
నగరంలో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలనీల్లో ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
నగరానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తులపై నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, అనుమానాస్పద కదలికలపై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ అమలు చర్యలు కట్టుదిట్టం చేసి రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కమిషనర్ సూచించారు.
అలాగే ఆన్లైన్ బెట్టింగ్‌లు, గేమింగ్ యాప్‌ల మోజుతో యువత సైబర్ మోసాలకు గురవుతున్న నేపథ్యంలో ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు. డ్రగ్స్ నియంత్రణకు యువతలో నిరంతర అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
ప్రతి కేసు దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని, అధికారులు, సిబ్బంది 24 గంటలూ హెడ్‌క్వార్టర్స్ పరిధిలో అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు విధుల్లోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
తనిఖీల్లో ఏసీపీ ప్రకాష్ యాదవ్, టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్, టౌన్-3 ఎస్ఐ హరిబాబు, ఎస్ఐ నారాయణ తదితర అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
