HomeDevotional5,681 గణేశ్‌ విగ్రహాలకు జియోట్యాగింగ్‌..

5,681 గణేశ్‌ విగ్రహాలకు జియోట్యాగింగ్‌..

నిమజ్జన రూట్‌లో 100 సీసీ కెమెరాలుగణేశ్‌ నవరాత్రి ఉత్సవాల్లో అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ప్రత్యేక నిఘా వ్యవస్థను అమలు చేస్తోంది. కమిషనరేట్‌ పరిధిలో ఏర్పాటు చేసిన 5,681 గణేశ్‌ విగ్రహాలనూ జియోట్యాగింగ్‌ చేసి పోలీసుల పర్యవేక్షణలోకి తీసుకొచ్చింది.

మండపాల వద్ద ఏ చిన్న సమస్య తలెత్తినా సమాచారం అందిన వెంటనే పోలీసులు చేరుకునేలా క్షేత్రస్థాయి సిబ్బందికి మండపాల పూర్తి వివరాలు అందుబాటులో ఉంచారు. నిజామాబాద్‌ డివిజన్‌లో 2,545, ఆర్మూర్‌ డివిజన్‌లో 1,959, బోధన్‌ డివిజన్‌లో 1,177 గణేశ్‌ విగ్రహాలు ఏర్పాటు చేశారు. ప్రతి మండపం వద్ద బ్లూకోర్ట్స్‌, పెట్రోకార్‌ సిబ్బంది నిఘా కొనసాగిస్తున్నారు.

మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తూ రోజుకు మూడుసార్లు మండపాలను సందర్శించి పరిస్థితులను పరిశీలిస్తున్నారు. నిర్వాహకులకు భద్రతా సూచనలు ఇవ్వడంతోపాటు మండపాల వద్ద నిర్వహించే పాయింట్‌ బుక్‌లో సిబ్బంది సంతకం చేస్తున్నారు.ప్రతి మండపాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి ట్యాబ్‌ల ద్వారా ఫొటోలు, నిర్వాహకుల వివరాలు నమోదు చేస్తున్నారు.

పోలీస్‌ వెబ్‌ అప్లికేషన్‌లో ఆ వివరాలను పొందుపరిచి జియోట్యాగింగ్‌ చేస్తున్నారు. దీంతో ఏ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఎన్ని మండపాలు ఉన్నాయి, అవి ఎక్కడ ఉన్నాయి, నిర్వాహకులు ఎవరు అనే వివరాలు సిబ్బందికి అందుబాటులో ఉంటాయి.

అత్యవసర సమయంలో సంఘటనా స్థలానికి చేరుకునే మార్గాన్ని కూడా సులభంగా గుర్తించవచ్చు.గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా నిజామాబాద్‌లోని ప్రధాన నిమజ్జన మార్గాన్ని పోలీసులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. రూట్‌లో సుమారు 100 ఐపీ ఆధారిత సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేశారు.

24 గంటలూ సీసీ కెమెరాల ద్వారా పరిస్థితులను పర్యవేక్షించేలా సిబ్బందిని అందుబాటులో ఉంచారు. జనసమ్మర్థం, ట్రాఫిక్‌, అవాంఛనీయ ఘటనలపై ఎప్పటికప్పుడు నిఘా కొనసాగనుంది.గణేశ్‌ మండపాల ఏర్పాటుకు పోలీసు అనుమతుల కోసం నిర్వాహకులు పోలీస్‌స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌ దరఖాస్తు విధానాన్ని అమలు చేశారు.

దరఖాస్తులను పరిశీలించి స్థానిక పోలీసులు అనుమతులు మంజూరు చేస్తున్నారు. గణేశ్‌ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా ముందస్తు కార్యాచరణతో బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీస్‌ కమిషనర్‌ పి.సాయి చైతన్య తెలిపారు. మండపాల వద్ద భద్రతా ప్రమాణాలు పాటించాలని నిర్వాహకులకు సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments