HomeLaw and Orderమారుమూల పల్లెలకూ ఆర్టీసీ సేవలను విస్తరించాలి.. కలెక్టర్ ఇలా త్రిపాఠి..

మారుమూల పల్లెలకూ ఆర్టీసీ సేవలను విస్తరించాలి.. కలెక్టర్ ఇలా త్రిపాఠి..

విద్యార్థులకు, ప్రజలకు, రైతులకు రవాణా వసతి మెరుగుపర్చేందుకు వీలుగా మారుమూల ప్రాంతాలకు సైతం ఆర్టీసీ సేవలను విస్తరించాలని, ప్రజలు రాకపోకలు సాగించే రూట్లలో బస్సు సర్వీసులు నడపాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులను ఆదేశించారు.

ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండడం లేదని పలువురు ప్రజావాణిలో ఫిర్యాదులు చేయడం, ఇటీవల నిర్వహించిన ప్రజా పాలన గ్రామ సభలలో ఆర్టీసీ బస్సు సర్వీసుల కోసం ప్రజల నుండి విజ్ఞప్తులు రావడాన్ని దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఐ.డీ.ఓ.సీలో ఆర్టీసీ అధికారులు, మండల పరిషత్ అధికారుల(ఎం.పీ.ఓ)తో ఉమ్మడి సమావేశం నిర్వహించారు.

ఆయా మండలాల పరిధిలో ఆర్టీసీ బస్సు సర్వీసులు అవసరమైన మారుమూల గ్రామాలు, తండాల వివరాలను ఎం.పీ.ఓల ద్వారా సేకరించి, ఆ జాబితాను ఆర్టీసీ అధికారులకు అందజేయించారు. ప్రజల రవాణా అవసరాలకు అనుగుణంగా ఆయా ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు నడిపించాలని కలెక్టర్ సూచించారు.

ప్రజల రాకపోకలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలకు బస్సు సర్వీసులు నడపడం వల్ల అటు ప్రజలకు రవాణా సౌలభ్యం ఏర్పడడంతో పాటు ఆర్టీసీ సంస్థకు కూడా తగిన ఆదాయం సమకూరుతుందని అన్నారు. ప్రస్తుతం పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయని, ఖరీఫ్ సీజన్ పంటలు విత్తుకునేందుకు రైతులు ఎరువులు, విత్తనాలు, క్రిమి సంహారక మందుల కోసం రాకపోకలు సాగిస్తారని, ప్రజలు తమ దైనందిన అవసరాల కోసం రవాణా వసతిపై ఆధారపడతారని అన్నారు.

దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయా నివాస ప్రాంతాలు, మారుమూల గ్రామాలకు కొత్తగా ఆర్టీసీ బస్సు సర్వీసులు నడిపించాలని, అవసరమైన చోట ప్రయాణికులు, ప్రజల రద్దీని బట్టి బస్సు ట్రిప్పుల సంఖ్యను పెంచాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఎం.పీ.ఓలు ప్రతిపాదించిన జాబితాను పరిశీలించి, అవసరం ఉన్న అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సు సర్వీసులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.

కొత్తగా ఏర్పడిన నివాస ప్రాంతాల ప్రజలకు కూడా రవాణా వసతి ఉండాలన్నారు. ప్రతిపాదిత రూట్లలో వచ్చే సోమవారం నుండి ఆర్టీసీ బస్సులు నడిచేలా చర్యలు తీసుకోవాలని, పక్షం రోజుల తరువాత తాను మరోమారు సమీక్ష నిర్వహిస్తానని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, ఆర్టీసీ ఆర్.ఎం మూర్తి, డిప్యూటి ఆర్.ఎం మధుసూదన్, డిపో-1 మేనేజర్ ఆనంద్, అన్ని మండలాల ఎం.పీ.ఓలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments