అవినీతి అధికారులకు సంబంధించి ఏసీబి వేట ఇంకా కొనసాగుతుంది. మంగళవారం మరో భారీ తిమింగలం చిక్కింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం నుంచి విస్తృత తనిఖీలు చేపట్టారు.
ఆయన ఇంట్లో నోట్ల కట్టలు కాదు గుట్టలే దర్శనం ఇచ్చాయి. నగరంలోని నరహరి నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన ఆఫీసులు, బంధువులు, అత్యంత ఆప్తుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని దాదాపు 10 విభిన్న ప్రాంతాలలో ఈ దాడులు కొనసాగుతున్నాయి.
నరహరి తన అధికారిక ఆదాయానికి మించి భారీగా అక్రమ ఆస్తులను కూడబెట్టారనే ఆరోపణలపై ఏసీబీ ఈ చర్యలు చేపట్టింది. ఈ తనిఖీల్లో కీలకమైన భూమి పత్రాలు, బ్యాంక్ ఖాతాల వివరాలు, నగదు, బంగారు ఆభరణాలకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి… భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. ఇప్పటి వరకూ నిర్వహించిన సోదాల్లో రూ.200 కోట్ల అక్రమాస్తుల్ని గుర్తించినట్లు సమాచారం.
కీలకమైన భూమి పత్రాలు, బ్యాంక్ ఖాతాల వివరాలు, నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. బెడ్రూమ్ లో ఉన్న బెడ్ కింద రూ.1.10 కోట్ల విలువైన నోట్ల కట్టలు, బీరువాల్లో భారీగా బంగారం, వెండి ఆభరణాలను గుర్తించారు. సంచుల్లో నోట్ల కట్టలు నింపి సజ్జపై దాచి ఉంచిన నగదు ను స్వాధీనం చేసుకున్నారు.
