మనిషిని శారీరకంగా, మానసికంగా దృఢంగా మలచడమే కాకుండా, క్రమశిక్షణతో కూడిన జీవనానికి బాటలు వేస్తాయని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 40వ ‘ఒలింపిక్ డే రన్-2026’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఒలింపిక్ క్రీడలు ప్రబోధించే ఐక్యత, శాంతి, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. నేటి యువత చదువుతో పాటు క్రీడల్లోనూ చురుకుగా పాల్గొని, తమ ప్రతిభతో రాష్ట్ర, దేశ కీర్తిని దశదిశలా చాటాలని ఆకాంక్షించారు.
క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా జిల్లా ఒలింపిక్ సంఘం చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. అనంతరం జెండా ఊపి ఒలింపిక్ డే రన్‌ను ప్రారంభించిన మహేష్ కుమార్ గౌడ్, క్రీడాకారులతో కలిసి కొంతదూరం పరుగు తీసి వారిలో ఉత్సాహాన్ని నింపారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఉమారాణి, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నాయకులు ఆకుల లలిత, కేశ వేణు, చంద్రశేఖర్ గౌడ్, జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి బొబ్బిలి నరసయ్య, క్రీడాకారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
