ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్మూర్ ప్రాంతంలో గల ‘భరత్ చంద్ర హైస్కూల్’ యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరుపై అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులపై బలవంతంగా ఉర్దూ భాషను రుద్దుతున్నారని ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వినర్ కైరి శశిధర్ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఏబీవీపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా కైరి శశిధర్ మాట్లాడుతూ.. విద్యాశాఖ నిర్ణయించిన అధికారిక సిలబస్, లాంగ్వేజ్ పాలసీని సదరు యాజమాన్యం బేఖాతరు చేస్తోందని మండిపడ్డారు. సొంత నిబంధనలతో విద్యార్థులపై భాషను రుద్దడం విద్యా చట్టాలను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు.
పాఠశాల నిర్ణయం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఒత్తిడికి, ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో థర్డ్ లాంగ్వేజ్‌గా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ భాషకు అనుమతి ఉందో విద్యాశాఖ అధికారులు (డీఈవో, ఎంఈవో) తక్షణమే పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కోరారు.
చట్టాలను అతిక్రమించిన ప్రిన్సిపాల్, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని ఇతర ప్రైవేట్ పాఠశాలలు ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా యంత్రాంగం కఠిన ఆదేశాలు జారీ చేయాలన్నారు.
లేనిపక్షంలో విద్యార్థులు, తల్లిదండ్రులను సమీకరించి పాఠశాల ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు ప్రవీణ్ కుమార్, ప్రితం, చెర్రీ, కుల్వంత్, సౌరాబ్, దీపాన్, సిద్దు, రాజేష్, గుడ్డు, బాలు, శశాంక్, రక్షిత తదితరులు పాల్గొన్నారు.
