ప్రజాప్రతినిధులపై ఆగ్రహంప్రజల రాకపోకలు సులభతరం చేయాలనే ఉద్దేశంతో నగరంలో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులే ప్రస్తుతం ప్రజలకు శాపంగా మారాయి.
నిజామాబాద్ నగరంలోని డిచ్‌పల్లి–నిజామాబాద్ లింక్ రోడ్డులో హనుమాన్ జంక్షన్ నుంచి నిఖిల్ సాయి వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతుండటంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ రహదారి అభివృద్ధికి రూ.7.66 కోట్ల వ్యయంతో 2024 నవంబరులో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అయితే పనులు మాత్రం నాలుగు నెలల క్రితమే ప్రారంభమయ్యాయి. ప్రారంభమైనా ఆశించిన వేగం కనిపించకపోగా, అడుగడుగునా ఆలస్యం నెలకొంది.
రోడ్డుపై కంకర వేసి, మధ్యలో డివైడర్‌ను నామమాత్రంగా నిర్మించి పనులను మధ్యలోనే వదిలేయడంతో రహదారి అధ్వానంగా మారింది. దీంతో ప్రతిరోజూ ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు దుమ్ము, దూళి, కంకర మధ్య ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడింది.
ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి కిందపడుతున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే పలువురు గాయపడినా సంబంధిత అధికారులు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ప్రజల ఇబ్బందులను గాలికొదిలేసిన అధికారులు పనులను వేగవంతం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సైతం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.
“ఇంకెన్నాళ్లు ఈ నరకయాతన అనుభవించాలి ప్రతిరోజూ దుమ్ము, దూళి, కంకర మధ్య ప్రయాణించడం భారంగా మారింది. ప్రమాద భయంతోనే రోడ్డెక్కాల్సి వస్తోంది” అంటూ వాహనదారులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేసి ప్రజల ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపాలని నగరవాసులు కోరుతున్నారు.
