నిజామాబాద్ టాడీ కోఆపరేటివ్ సొసైటీ ‘మెంబర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం’ సహకార సంఘాల సభ్యులు వ్యాపార వ్యవహారాలను మెరుగుపరుచుకోవడంలో, కాలంతో పాటు వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవడంలో నిరంతర సాధన చేయాలని తెలంగాణ సహకార యూనియన్ (హైదరాబాద్) ప్రిన్సిపాల్ భూక్య వెంకన్న పిలుపునిచ్చారు.
బుధవారం నిజామాబాద్ అర్బన్ మండలంలోని టాడీ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మెంబర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను గుర్తించి, సభ్యులంతా సమిష్టి నిర్ణయాలతో ముందుకు సాగాలని సూచించారు. ప్రభుత్వ నిర్దేశాలను పాటిస్తూ వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు.
అలాగే సంఘం సభ్యత్వ అర్హతలు, బాధ్యతలు, మహాజన సభ అధికారాలపై అవగాహన కల్పించారు. ట్రైనీ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె. గాయత్రి మాట్లాడుతూ.. సహకార రంగంలో సభ్యుల మధ్య క్రమశిక్షణ, పారదర్శకత, జవాబుదారీతనం చాలా ముఖ్యమని పేర్కొన్నారు.
అనంతరం ఎక్సైజ్ ఎస్‌హెచ్‌ఓ కె. గంగాధర్ మాట్లాడుతూ, సంఘం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పక్కా వ్యాపార ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని సూచించారు.
సొసైటీ అధ్యక్షుడు కె. నర్సా గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సభ్యులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కార్యక్రమంలో ఆఫీస్ సూపరింటెండెంట్ అరుణ్ కుమార్, సీనియర్ ఇన్‌స్పెక్టర్ మహ్మద్ అబ్దుల్ కలీం, సొసైటీ నాయకులు కిషన్ గౌడ్, నాగరాజ్ గౌడ్, పరమేశ్వర్ గౌడ్, శివలింగం గౌడ్, నరేష్ గౌడ్, శంకర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ఎక్సైజ్ శాఖ సిబ్బంది, పెద్ద సంఖ్యలో సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. చివరగా అధ్యక్షుడు కె. నర్సా గౌడ్ అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు.
