రైల్వేశాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా జానకంపేట వద్ద అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైల్వే గూడ్స్ షెడ్ ప్రారంభానికి సిద్ధమైంది. సుమారు 9 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేసిన ఈ గూడ్స్ షెడ్‌ను బుధవారం ఉదయం 11 గంటలకు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి అధికారికంగా ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, అంజిరెడ్డి, కొమరయ్య, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తదితరులు పాల్గొననున్నారు. గూడ్స్ షెడ్ ప్రారంభోత్సవానికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రైల్వే శాఖ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తోంది. ముఖ్యంగా ముద్ఖేడ్ – మేడ్చల్ మార్గంలో రైల్వే వ్యవస్థను ఆధునీకరించడంతో పాటు, డబ్లింగ్ పనులపై ప్రత్యేక దృష్టి సారించింది.
ఈ మార్గంలో ముద్ఖేడ్ – డోన్ మధ్య రూ. 4,686 కోట్ల వ్యయంతో చేపట్టిన డబ్లింగ్ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే బాసర – నవీపేట్ మధ్య 15 కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులు పూర్తయి, డబుల్ లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల సిగ్నల్ వ్యవస్థ మెరుగుపడటంతో పాటు, రైళ్ల రాకపోకలు సకాలంలో, వేగవంతంగా సాగుతున్నాయి.
అత్యాధునిక హంగులతో నిజామాబాద్ స్టేషన్
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 58 కోట్ల రూపాయల వ్యయంతో నిజామాబాద్ రైల్వే స్టేషన్‌ను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నారు.
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అటు, కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇందల్వాయి మరియు జానకంపేట్ గూడ్స్ షెడ్ వద్ద కొత్తగా రెండు ఆర్‌ఓబీలను మంజూరు చేసింది.
నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రైల్వే వ్యవస్థను పూర్తిగా అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
జానకంపేట గూడ్స్ షెడ్ ప్రారంభోత్సవంతో స్థానిక వ్యాపారులకు, రవాణా రంగానికి ఎంతో మేలు చేకూరుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
