యజమాని నమ్మి డ్రైవర్‌గా పెట్టుకుంటే.. అదే నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కారులోని నగదును కాజేసిన పాత నేరస్తుడిని సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్టు చేశారు.
నిందితుడి వద్ద నుండి రూ. 5,04,900 నగదుతో పాటు పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వ్యాపారవేత్త దయారామ్ ప్రజాపత్ వద్ద కుతాడి హరి కుమార్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
ఈ నెల 9న దయారామ్ కోఠిలోని బ్యాంక్ స్ట్రీట్‌కు వెళ్లారు. షాపింగ్ కోసం దిగే సమయంలో కారు తాళాలు డ్రైవర్ హరి కుమార్ వద్దే ఉన్నాయి. ఈ అదను చూసుకున్న నిందితుడు, కారులో ఉన్న బ్యాగ్‌లోని రూ. 5,50,000 నగదును దొంగిలించి, వెంటనే అక్కడి నుంచి కర్నూలుకు పారిపోయాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తాను, యజమాని ఇచ్చే వేతనం సరిపోవడం లేదని భావించిన హరి కుమార్.. కక్ష పెంచుకుని ఈ చోరీకి పాల్పడినట్లు విచారణలో తేలింది.
సాంకేతిక ఆధారాలను సేకరించిన పోలీసులు, షాద్‌నగర్ బస్టాండ్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు దొంగిలించిన డబ్బుతో కొనుగోలు చేసిన రెండు ఫోన్లను, మిగిలిన నగదును స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు హరి కుమార్ పాత నేరస్తుడని పోలీసులు తెలిపారు. 2010లో నవాబ్‌పేటలో దాడి కేసు, 2015లో వనపర్తిలో హత్య ( 302) కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో తొలుత జీవిత ఖైదు పడగా, హైకోర్టు దానిని రెండేళ్ల కఠిన కారాగార శిక్షకు తగ్గించింది.
అంతేకాకుండా, గతంలో ఫర్లోపై వచ్చి జైలు నుంచి తప్పించుకున్న కేసు కూడా ఇతనిపై ఉన్నట్లు తెలిపారు.ఖైరతాబాద్ జోన్ డీసీపీ పర్యవేక్షణలో, సుల్తాన్ బజార్ ఏసీపీ ఎం. మత్తయ్య, ఎస్.హెచ్.ఓ జి. నరేష్ మార్గనిర్దేశంలో.. డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ పి. ధర్మారావు, ఎస్సై బి. సాయినాథ్, కానిస్టేబుళ్లు ఎల్. చందన్ సింగ్, సి. సందీప్‌ల బృందం ఈ కేసును వేగంగా ఛేదించింది. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఈ బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.
