నగరంలో సరికొత్త ‘నెట్‌వర్క్ సెక్యూరిటీ లాబొరేటరీ’ని ప్రారంభించిన డీఓటీసైబర్ నేరాలు, టెలికాం మోసాల కట్టడికి సమన్వయమే ఆయుధమని, సురక్షిత డిజిటల్ వ్యవస్థ కోసం ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఏకతాటిపైకి రావాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ స్పష్టం చేసింది.
హైదరాబాద్ కేంద్రంగా డీఓటీ (ఆంధ్రప్రదేశ్ లైసెన్స్‌డ్ సర్వీస్ ఏరియా) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉన్నత స్థాయి భద్రతా సదస్సులో సైబర్ ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మేధోమథనం జరిగింది.
ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన టెలికాం డైరెక్టర్ జనరల్ ఆనంద్ ఖారే మాట్లాడుతూ, గత రెండేళ్లలో డీఓటీ సాధించిన విజయాలను వివరించారు. దేశవ్యాప్తంగా 5 కోట్లకు పైగా నకిలీ మొబైల్ కనెక్షన్లను ఏరివేశామని, 12 లక్షల చోరీకి గురైన మొబైల్స్‌ను రికవరీ చేశామని తెలిపారు.
ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ ద్వారా రూ. 1,800 కోట్ల మేర సైబర్ మోసాలను అడ్డుకున్నట్లు వెల్లడించారు. టెలికాం స్పెషల్ డీజీ శ్రీమతి దీపా అరోరా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఎస్పీ హర్షవర్ధన్ తదితర ఉన్నతాధికారులు సదస్సులో పాలుపంచుకున్నారు.
ఆర్థిక సంవత్సరం 2025-26లో దేశంలోనే అత్యుత్తమ పనితీరును ప్రదర్శించి, 11 అక్రమ టెలికాం, సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌లను ఛేదించినట్లు ఏపీ ఎల్ఎస్‌ఏ పేర్కొంది.
అలాగే, అత్యధికంగా 2.04 లక్షల పోగొట్టుకున్న మొబైల్స్‌ను రికవరీ చేసి ప్రజలకు అండగా నిలిచింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ మాట్లాడుతూ, ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’ ద్వారా వ్యవస్థీకృత టెలికాం మోసాలపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు.
బ్యాంకింగ్, పోలీస్, టెలికాం శాఖల మధ్య సమన్వయం పెరిగినప్పుడే సైబర్ నేరగాళ్లకు ముకుతాడు పడుతుందని ఆయన స్పష్టం చేశారు.సదస్సు ముగింపులో, దేశంలోనే తొలిసారిగా డీఓటీ ఏపీ ఎల్ఎస్‌ఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ‘నెట్‌వర్క్ సెక్యూరిటీ లాబొరేటరీ’ని ఆనంద్ ఖారే ప్రారంభించారు.
ముప్పుల విశ్లేషణ, సామర్థ్య పెంపుదల కోసం ఈ ల్యాబ్ ఎంతో దోహదపడుతుందని అధికారులు తెలిపారు. అనంతరం ల్యాబ్ పనితీరుపై ప్రత్యక్ష ప్రదర్శన నిర్వహించారు.
ఈ సదస్సులో ముఖ్యంగా ‘ఘోస్ట్ సిమ్ నెట్‌వర్క్స్’పై చర్చ జరగడం, కృత్రిమ మేధస్సు (AI) ద్వారా సైబర్ రక్షణ సామర్థ్యాలను పెంపొందించుకోవాలని నిర్ణయించడం గమనార్హం. ఈ కార్యక్రమంలో ఆర్‌బీఐ, ఎస్‌బీఐ ప్రతినిధులు, సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు తదితరులు పాల్గొన్నారు.
