రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరి, నిర్లక్ష్యంతో విద్యారంగం అంధకారంలోకి వెళ్తోందని, ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద చేపట్టిన నిరసన దీక్షకు ఆయన సంఘీభావం ప్రకటించి, మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్నం పెట్టే రైతాంగం వర్షాభావ పరిస్థితులతో సతమతమవుతుంటే, విద్యాదాతలైన ఉపాధ్యాయులు సైతం వీధిన పడటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాల వల్లే ఉపాధ్యాయులు రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.
రాష్ట్రంలో సుమారు 51 శాతం పిఆర్సి పెండింగ్లో ఉండటం, దేశంలో మరెక్కడా లేని విధంగా ఆరు డిఎ బకాయిలు నిలిచిపోవడం ప్రభుత్వానికి పద్ధతి కాదని దుయ్యబట్టారు.గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన నేటి ముఖ్యమంత్రి, ఇప్పుడు విద్యాశాఖ పగ్గాలు చేపట్టినా ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు.
మూసీ నది ప్రక్షాళనకు వేల కోట్లు వెచ్చించేందుకు చూపిస్తున్న ఆసక్తి, విద్యారంగంపై ఎందుకు లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో సుమారు 8 వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్, 4 వేల కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశారు.
ఉపాధ్యాయ వర్గాలతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ బాగుపడలేదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని సూచించారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు.
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో టీపీయు ఎస్ నాయకులు కిషన్ రెడ్డి, మధుసూదన్ చారి, వరప్రసాద్, బద్రీనాథ్, కృష్ణవేణి, కవిత తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
