45వ డివిజన్ ప్రజల మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని, అందులో భాగంగానే ‘అమృత్ 2.0’ పథకం కింద నూతన వాటర్ పైప్లైన్ పనులను ప్రారంభించినట్లు కార్పొరేటర్ బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్ తెలిపారు.
మంగళవారం డివిజన్లో చేపట్టిన ఈ అభివృద్ధి కార్యక్రమానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘అమృత్ 2.0’ పథకం ద్వారా నిధులు మంజూరయ్యాయని, డివిజన్ పరిధిలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడమే లక్ష్యంగా ఈ పనులను చేపట్టినట్లు వెల్లడించారు.
ఈ నూతన పైప్లైన్ పనులు కాకతీయ స్కూల్ వద్ద ప్రారంభమై, శ్రీనగర్, అమరేశ్వర్ కాలనీ, ప్రగతి నగర్ మీదుగా ఎల్లమ్మ గుట్ట వరకు కొనసాగుతాయని ఆయన వివరించారు. ఈ పనుల వల్ల డివిజన్లోని పలు ప్రాంతాలకు మెరుగైన తాగునీటి సౌకర్యం అందుతుందని, అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని సువర్ణ వేణుగోపాల్ స్పష్టం చేశారు.
