కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీని నివారించి వాహనాల రాకపోకలను మరింత సులభతరం చేయడానికి ప్రతిపాదించిన వన్‌వే విధానం అమలుకు అధికారులు వేగంగా చర్యలు చేపడుతున్నారు.
ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం వివిధ శాఖల ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో సంయుక్తంగా పరిశీలన నిర్వహించారు.
ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు అధికారులు కేబీఆర్ పార్క్ చుట్టూ సుమారు ఐదు కిలోమీటర్ల మేర కాలినడకన తిరుగుతూ రహదారులు, ప్రధాన కూడళ్లు, ట్రాఫిక్ పరిస్థితులను నిశితంగా పరిశీలించారు.
అగ్రసేన్ కూడలి, ఫిలింనగర్, జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-45, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ ప్రధాన ద్వారం తదితర ప్రాంతాలను సందర్శించి అక్కడి ట్రాఫిక్ సరళి, రద్దీ తీవ్రత, వాహనాల రాకపోకలను పరిశీలించి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.హెచ్-సిటీ ప్రాజెక్టు పనుల నేపథ్యంలో ఇటీవల కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్వహించిన వన్‌వే ట్రయల్ రన్ సందర్భంగా ఎదురైన ఇబ్బందులను అధికారులు సమీక్షించారు.
కొన్ని ప్రాంతాల్లో రహదారులు ఇరుకుగా ఉండటం వల్లే రద్దీ వేళల్లో ట్రాఫిక్ స్తంభిస్తున్నట్లు గుర్తించారు. దీంతో సమస్యాత్మక ప్రాంతాల్లో తక్షణమే రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే విధానాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు వివిధ శాఖలు చేపట్టాల్సిన పనుల పురోగతిని సమీక్షించినట్లు తెలిపారు.
వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చిన్నపాటి సివిల్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. ముఖ్యంగా పాదచారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ రోడ్లు దాటే ప్రాంతాల్లో పెలికాన్ సిగ్నల్స్, లేన్ మార్కింగ్‌లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న కేబీఆర్ పార్క్ అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని నిర్మాణ సంస్థల ప్రతినిధులకు సూచించారు.
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ.. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీని శాశ్వతంగా తగ్గించే లక్ష్యంతో ప్రతిపాదించిన వన్‌వే విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపారు.
హైదరాబాద్ సిటీ పోలీస్ సూచించిన అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని, పనులు జరిగే సమయంలో ప్రజలు సహకరించాలని కోరారు. నగరవాసులకు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు, జీహెచ్‌ఎంసీ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు.
ఈ పరిశీలన అనంతరం వన్‌వే అమలుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, రోడ్ల విస్తరణ, సిగ్నలింగ్ వ్యవస్థ, పాదచారుల భద్రతకు సంబంధించిన పనులను త్వరలో పూర్తి చేసి వన్‌వే విధానాన్ని అమల్లోకి తీసుకురావడానికి చర్యలు వేగవంతం చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ పరిశీలనలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ సంతోష్, డీసీపీ (ట్రాఫిక్) కాజల్‌తో పాటు జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీస్ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
