HomeCRIMEగుణపాఠం నేర్చుకోలేని జైలు శాఖ.. వరుస వివాదాలతో మళ్లీ మసకబారిన నిజామాబాద్ సెంట్రల్ జైలు ప్రతిష్ఠ......

గుణపాఠం నేర్చుకోలేని జైలు శాఖ.. వరుస వివాదాలతో మళ్లీ మసకబారిన నిజామాబాద్ సెంట్రల్ జైలు ప్రతిష్ఠ… ఖైదీతో వార్డర్ బేరసారాలు.. బెయిల్ ఇప్పించి చోరీల్లో వాటా ఒప్పందం…

గత గంజాయి వివాదం మరువకముందే మరో ఘటనతో తీవ్ర విమర్శలుజిల్లా జైలు నుంచి కేంద్ర కారాగారంగా ఎదిగినా.. పాత వాసనలు మాత్రం వదలడం లేదు. కొందరు అధికారుల కాసుల కక్కుర్తి జైలు ప్రతిష్ఠను మసకబార్చుతోంది. పరివర్తన కోసం జైలుకు వచ్చిన ఖైదీలనే అక్రమాల సాధనంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

గతంలో గంజాయి వ్యవహారంతో రాష్ట్రవ్యాప్తంగా అపఖ్యాతి పాలైన నిజామాబాద్ కేంద్ర కారాగారం.. తాజాగా రిమాండ్ ఖైదీతో వార్డర్ అక్రమ ఒప్పందం కుదుర్చుకున్న ఘటనతో మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. వరుస ఘటనలు వెలుగుచూస్తున్నా జైలు శాఖ మాత్రం గుణపాఠం నేర్చుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గత ఏడాది జైలులో గంజాయి సరఫరాపై ఖైదీల మధ్య ఘర్షణ జరగడం, అనంతరం వారిపై దాడి జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటనలో ఒక డిప్యూటీ జైలర్ సస్పెండ్ కాగా, మరొకరిని బదిలీ చేశారు. జైలు సూపరింటెండెంట్‌ను సైతం విధుల నుంచి తాత్కాలికంగా తప్పించారు.

ఇంత పెద్ద ఘటన తర్వాతైనా వ్యవస్థలో మార్పు వస్తుందని భావించినా, పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనిపించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లాకు చెందిన రిమాండ్ ఖైదీ భిక్షపతి వ్యవహారం జైలు శాఖ పనితీరుపై తీవ్ర అనుమానాలకు తావిస్తోంది.

వరుస దొంగతనాలకు పాల్పడిన భిక్షపతి నిజామాబాద్ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉండగా, జైలు వార్డర్ గోపాల్‌రెడ్డి అతనితో అక్రమ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన తర్వాత చేసే చోరీల్లో వాటా ఇవ్వాలనే షరతుతో అతడికి సహకరించినట్లు సమాచారం.

ఇందుకోసం సుమారు రూ.70 వేల వరకు వసూలు చేసి బెయిల్ ప్రక్రియ సులభతరం చేసినట్లు దర్యాప్తులో బయటపడినట్లు తెలుస్తోంది.బెయిల్‌పై విడుదలైన కొద్ది రోజులకే భిక్షపతి సిద్ధిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ చోరీకి పాల్పడగా, పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో జైలు వార్డర్ సహకారంతోనే తాను విడుదలైనట్లు భిక్షపతి వెల్లడించినట్లు సమాచారం.

దీంతో జైలు వార్డర్ గోపాల్‌రెడ్డిని జైళ్ల శాఖ సస్పెండ్ చేస్తూ శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఒక ఘటన నుంచి గుణపాఠం నేర్చుకుని వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన జైలు శాఖలో వరుసగా ఇలాంటి ఆరోపణలు వెలుగుచూడడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

జైలు గోడల మధ్య జరుగుతున్న అక్రమాలపై ఉన్నతాధికారులు కఠినంగా స్పందించకపోతే కేంద్ర కారాగారం ప్రతిష్ఠ మరింత దెబ్బతింటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు చెప్పే క్రమశిక్షణ మాటల్లోనే మిగిలిపోతోందా జైలులో జరుగుతున్న అక్రమాలకు ఎవరు బాధ్యత వహిస్తారు అనే ప్రశ్నలు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments