నిజామాబాద్ నగరంలోని రైల్వే స్టేషన్ ఎదురుగా వెళ్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.స్థానికుల వివరాల ప్రకారం..
నిజామాబాద్ బస్టాండ్ నుంచి బయలుదేరిన మెట్పల్లి మరియు నందిపేట బస్సులు నగరంలోని రైల్వే స్టేషన్ మార్గంలో వెళ్తున్నాయి. స్టేషన్ ఎదురుగా రాగానే, మెట్పల్లి వైపు వెళ్తున్న బస్సును వెనుక నుంచి వస్తున్న నందిపేట బస్సు బలంగా ఢీకొట్టింది.
ఈ ఘటనలో మెట్పల్లి బస్సు వెనక భాగం స్వల్పంగా దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తూ ప్రయాణికులెవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రెండు బస్సులు అక్కడే ఆగిపోవడంతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో వాహనాలు సుమారు గంటపాటు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆగిపోయిన బస్సులను పక్కకు తొలగించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
