కేవలం తమకు జరిగిన అన్యాయంపై శాంతియుతంగా న్యాయం మాత్రమే అడిగిన విద్యార్థులను కేంద్ర బలగాలు హింసించాయని బిఆర్ యస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ అన్నారు . యువత శక్తిని తక్కువ అంచనా వేయొద్దని హితవు పలికారు.
ఇది భయపడే జనరేషన్ కాదు.. పాలకులను భయపెట్టే జనరేషన్ అని సూచించారు. గతంలో ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని గుర్తుచేశారు. . బీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి విభాగం (BRSV) పిలుపు మేరకు శుక్రవారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ (ధర్నా చౌక్) వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ ధర్నాకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, యువకులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్ల చొక్కా ధరించి పాల్గొన్నారు. తన జన్మదిన వేడుకలను సైతం రద్దు చేసుకుని విద్యార్థుల హక్కుల కోసం నేరుగా ధర్నా స్థలానికి వచ్చి నిరసన తెలిపారు.
ఈ ధర్నాలో కేటీఆర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి” అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల జులుం నశించాలని, యువతపై జరుగుతున్న దమనకాండను వెంటనే ఆపాలని నినాదాలు చేశారు ఇప్పుడు కూడా విద్యార్థుల కోసం కేంద్ర అరాచకాలను గట్టిగా ఎండగడతామని స్పష్టం చేశారు.
న్యాయం జరిగే వరకు విద్యార్థులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, ఇటీవల యువతతో పెట్టుకున్న నేపాల్, బంగ్లాదేశ్ ప్రభుత్వాలు ఎలా కుప్పకూలాయో కేంద్రం గుర్తుంచుకోవాలి అని హెచ్చరించారు.
శవ్యాప్తంగా పార్టీలకు అతీతంగా యువత కదం తొక్కుతోందని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
