సెలవు రోజునా క్షేత్రస్థాయిలో విద్యుత్ శాఖ అధికారులురెవెన్యూ వసూళ్లను మరింత వేగవంతం చేసేందుకు విద్యుత్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది.
శాఖ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునే క్రమంలో అధికారులు, సిబ్బంది ఆదివారం సెలవు రోజున కూడా విశ్రాంతి లేకుండా క్షేత్రస్థాయిలో విస్తృతంగా బిల్లుల వసూళ్ల కార్యక్రమాన్ని నిర్వహించారు.
బకాయిలు చెల్లించకుండా కొనసాగుతున్న విద్యుత్ వినియోగదారులను గుర్తించి ఇంటింటికీ వెళ్లి బిల్లులు చెల్లించేలా అవగాహన కల్పించారు. స్పందించి బకాయిలు చెల్లించిన వారి నుంచి వసూళ్లు చేపట్టగా, నిర్లక్ష్యం చేసిన వినియోగదారుల విద్యుత్ కనెక్షన్లను నిబంధనల ప్రకారం నిలిపివేశారు.
భారీ బకాయిల వసూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది. శాఖకు నిర్దేశించిన రెవెన్యూ లక్ష్యాలను సాధించేందుకు సెలవు దినాన కూడా సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేయడం గమనార్హం.
బకాయిలు పేరుకుపోకుండా వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించి సహకరించాలని అధికారులు కోరుతున్నారు. ఇదే తరహా ప్రత్యేక వసూళ్ల కార్యక్రమాలు రానున్న రోజుల్లోనూ కొనసాగనున్నట్లు సమాచారం.
