హరీష్ రావు క్షుద్ర పూజల వ్యవహారంపై తాము చేసిన వ్యాఖ్యలకు లీగల్ నోటీసులు అందాయని, వాటికి చట్టపరంగా తగిన సమాధానం ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
తమకు ఎవరి పట్లా వ్యక్తిగత కక్షలు లేవని, రాష్ట్ర ప్రజల అవసరాలు, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మాత్రమే తాము మాట్లాడుతున్నామని ఆయన స్పష్టం చేశారు.బుధవారం నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడారు.
అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా అందరినీ గౌరవిస్తామని, కానీ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నించడం తమ బాధ్యత అని పేర్కొన్నారు.బీఆర్ఎస్ సీనియర్ నేత టి. హరీష్ రావు ఇటీవల తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోని కొన్ని ఆలయాల్లో నిర్వహించినట్లు ప్రత్యేక పూజలపై ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని టీపీసీసీ డిమాండ్ చేశారు.
రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకునే నాయకుడు గోప్యంగా ఇతర రాష్ట్రాల ఆలయాలను సందర్శించడం, అక్కడ ఎలాంటి పూజలు నిర్వహించడం వెనుక ఉద్దేశం ఏమిటో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.
హరీష్రావు ఏ తేదీల్లో ఏ ఆలయాలను సందర్శించారు? అక్కడ ఎలాంటి పూజలు నిర్వహించారు? ఆ పూజల ఉద్దేశం ఏమిటి? అనే అంశాలపై స్వయంగా స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. సాధారణంగా శ్రీశైలం, తిరుపతి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు మీడియాతో మాట్లాడే హరీష్రావు, ఈసారి మాత్రం ఎలాంటి సమాచారం లేకుండా గోప్యంగా ఆలయాలను సందర్శించడం పలు సందేహాలకు తావిస్తోందన్నారు.
తమకు మూఢనమ్మకాలపై విశ్వాసం లేదని పేర్కొన్న, ఒక బాద్యత గల వ్యక్తి పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు అలాంటి నానుడి ఉన్న గుళ్ళలో ప్రత్యేక పూజలు చేయడాన్ని మేము ఆక్షేపించాము. తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి వ్యక్తిగత విమర్శలు లేవని, “ఇలాంటి పూజలు రాష్ట్రానికి శ్రేయస్కరం కావని” మాత్రమే చెప్పానని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
అయితే ఆ వ్యాఖ్యలకే తనకు లీగల్ నోటీసులు పంపించారని, వాటికి చట్టపరంగా సమాధానం ఇస్తామని తెలిపారు. కానీ హరీష్రావు ఈ వ్యవహారంపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేసేలా పూర్తి వివరణ ఇవ్వాలని మహేష్ కుమార్ గౌడ్ మరోసారి కోరారు.
